Sashi Tharoor: పుతిన్ విందుకు శశిథరూర్ హాజరుపై కాంగ్రెస్లో మళ్లీ రచ్చ!
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ఈ రోజు రాత్రి ఏర్పాటు చేసిన విందుకు శశిథరూర్ (Sashi Tharoor) హాజరవడం ఆ పార్టీలో విమర్శలకు దారితీసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ఆహ్వానం అందకపోవడం ఈ వివాదానికి కారణమైంది.
థరూర్ (Sashi Tharoor) నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “మా నాయకులకు ఆహ్వానం అందనప్పుడు, నాకు ఆహ్వానం వస్తే, ఆ ‘గేమ్’ ఏంటో, ఎవరు ఆడుతున్నారో, అందులో మనం ఎందుకు భాగం కాకూడదో అర్థం చేసుకోవాలి,” అని ఖేరా పరోక్షంగా విమర్శలు చేశారు. ఒక కాంగ్రెస్ సభ్యుడికి ఆహ్వానం పంపడం, దాన్ని అంగీకరించడం తనకు “ఆశ్చర్యంగా” అనిపించిందని ఆయన అన్నారు. “ప్రతి ఒక్కరి మనస్సాక్షి ఉంటుంది. దానికి సమాధానం చెప్పుకోవాలి,” అని పవన్ ఖేరా ఆగ్రహం వ్యక్తంచేశారు.
మరోవైపు, పుతిన్ కోసం ఏర్పాటు చేసిన విందుకు శశిథరూర్ హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం పంపకపోవడం సరికాదని థరూర్ పేర్కొన్నారు. “ఆహ్వానం ఏ ప్రాతిపదికన పంపుతున్నారో నాకు తెలియదు, కానీ నేను తప్పకుండా వెళ్తాను,” అని విందుకు ముందు ఆయన (Sashi Tharoor) చెప్పారు.






