దేశం గురించే టాటా తపన.. వ్యాపారరంగంలో అలాంటి వాళ్లు అరుదు: చంద్రబాబు

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ముంబయి వెళ్లారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌తో కలిసి ముంబయిలోని నారిమన్ పాయింట్ వద్దకు విచ్చేసిన చంద్రబాబు… రతన్ టాటా భౌతికకాయానికి టాటాకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టాటాతో తన సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. రతన్ టాటాను ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించిన చంద్రబాబు.. ఆయనతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని చెప్పారు. టాటా ఎప్పుడూ దేశం గురించే మాట్లాడేవారని, తన చేతల ద్వారానూ ఆ విషయాన్ని నిరూపించుకున్నారని ప్రశంసించారు. వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ఓవైపు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూనే, మరోవైపు తన జీవితాంతం సామాజిక కార్యక్రమాలు చేపట్టారని టాటాను ప్రశంసించారు. ప్రపంచ ముఖచిత్రంపై భారత్ కనిపించేలా చేశారని, ఓ పారిశ్రామికవేత్తగా ఆయనకు అమోఘమైన విజన్ ఉందని చంద్రబాబు కొనియాడారు.