Central Budget: బడ్జెట్‌కు పారిశ్రామిక వర్గాల నుంచి సూచనలు అడిగిన కేంద్రం
రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ (Central Budget) తయారీని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పన్ను రేట్లు, విధానపరమైన మార్పులపై వాణిజ్య, పరిశ్రమ సంఘాల నుండి సూచనలను కేంద్రం (Central Government) ఆహ్వానించింది. ఈ అభిప్రాయాలను నవంబర్ 10 లోపు సమర్పించాలని మంత్రిత్వ శాఖ (Finance Ministry) స్పష్టం చేసింది.
ఈ సూచనలలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన నిర్మాణం, రేట్ల సవరణలపై సిఫార్సులు ఉండవచ్చు. ముఖ్యంగా ఏదైనా పన్ను మార్పును సూచించినప్పుడు, దాని వల్ల కలిగే సానుకూల పరిణామాలను, వీలైతే దానికి సంబంధించిన గణాంకాలను జతచేయాలని పరిశ్రమలను ఆర్థిక శాఖ (Finance Ministry) కోరింది. అలాగే, ఏదైనా వస్తువుపై ‘ఇన్వర్టెడ్ డ్యూటీ’ నిర్మాణంలో మార్పులను కూడా సూచించాలని తెలిపింది. ప్రత్యక్ష పన్నుల (ఆదాయ లేదా కార్పొరేట్ పన్ను వంటివి) విషయంలో సిఫార్సులు చేసేటప్పుడు, వాటి వలన కలిగే ప్రయోజనాలను సంఖ్యాపరంగా వివరిస్తే.. బడ్జెట్ రూపకల్పన మరింత పారదర్శకంగా, నిర్దిష్టంగా ఉంటుందని ఆర్థిక శాఖ (Finance Ministry) భావిస్తోంది.







