Ashwini Vaishnav: కేంద్ర క్యాబినెట్ నిర్ణయం.. ఎన్‌సీడీసీకి రూ. 2 వేల కోట్లు

నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ) కు రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ఇచ్చేందు కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గ్రాంట్ ఇన్-ఎయిడ్ కింద నాలుగేళ్లపాటు దీన్ని అందించనుంది. రుణాల కింద మరిన్ని నిధులు సమకూర్చుకోవడానికి తాజా చర్య ఉయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిరచారు. దేశంలో 8.25 లక్షలకు పైగా ఉన్న సహకార సంఘాల్లోని 29 కోట్ల మంది సభ్యులకు ఈ కార్పొరేషన్ రుణాలు అందిస్తుంది. వీరిలో 94 శాతం మంది రైతులే ఉన్నారు. కేంద్రం అందించే ఈ ఆర్థిక సాయం ద్వారా అదనంగా మరో రూ.20 వేల కోట్ల రుణాలను ఎన్‌సీడీసీ సమకూర్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్‌సీడీసీ రుణ రికవరీ రేటు 99.8 శాతంగా ఉండగా, సున్నా ఎన్‌పీఏ ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.