Rahul Gandhi: ఈసీపై నమ్మకం లేకపోతే రాజీనామా చేయండి.. రాహుల్ గాంధీపై బీజేపీ చురకలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఎన్నికల సంఘం (Election Commission)పై నమ్మకం లేకపోతే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (Gaurav Bhatia) డిమాండ్ చేశారు. ఈసీ (EC)పై రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని భాటియా విమర్శించారు. ఎన్నికల సంఘం నిజాయితీపై ఎటువంటి సందేహం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) కూడా గుర్తించిందని, ఈసీ పారదర్శక సంస్థగా తన ఖ్యాతిని పెంచుకుందని భాటియా గుర్తుచేశారు. ఈసీపై విశ్వసనీయత లేకపోతే రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటే అంగీకరించి, వ్యతిరేకంగా ఉంటే మాత్రం తిరస్కరిస్తారా అని భాటియా (Gaurav Bhatia) ప్రశ్నించారు. ఈసీపై నిందలు వేయడం మానుకోవాలని ఆయన సూచించారు. రాహుల్ చేసిన ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీ కోరితే ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపిస్తున్న నేపథ్యంలో భాటియా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.







