Supreme Court: ఎన్నికల సంఘానికి … సుప్రీంకోర్టు సూచన

బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సరైన వివరాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) , జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ (Joymalya Bagchi) లతో కూడిన ధర్మాసనం సూచించింది. విచారణ క్రమంలో ఆర్జేడీ నేత మనోజ్ రaా తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) వాదనలు వినిపించారు. ఓ నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని ఈసీ పేర్కొందని, కానీ వారు సజీవంగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో సందర్భంలో బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్లు ప్రకటించారని ఆరోపించారు. అయితే ఇటువంటి ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది (Rakesh Dwivedi) వాదించారు. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్లు, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని, ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాస్తవాలు, గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం సూచించింది.