India: శక్తివంతమైన గన్ తయారు చేసిన ఇండియా..!

భారత్ కు సరిహద్దు దేశాలతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు అనేది పహల్గాం దాడి తర్వాత చాలా మందికి స్పష్టత వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ స్పందించిన విధానం కూడా భారత్.. ఆయుధ సంపత్తి విషయంలో మరింత బలపడాలనే అభిప్రాయాలు సైతం వినపడేలా చేసింది. ఈ తరుణంలో భారత్ కీలక అడుగు వేసింది. అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని అభివృద్ధి చేసింది. అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) ను భారత్ తయారు చేసి సంచలనం సృష్టించింది.
ఈ ‘మేడ్-ఇన్-ఇండియా’ గన్ ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), రెండు భారతీయ కంపెనీలు- టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, భారత్ ఫోర్జ్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో 48 కిలోమీటర్లలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఆర్మీ చేధించే సామర్ధ్యాన్ని బలోపేతం చేసుకుంది. అంటే అమ్రిత్ సర్ లో ఈ ఆ ఆయుధాన్ని మొహరించి పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న లక్ష్యాన్ని చేధించవచ్చు. అమృత్ సర్ కు లాహోర్ కు మధ్య 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
వీటికి భారీగా ఖర్చు పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ సిద్దమైంది. 307 అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ తో పాటుగా 327 హై-మొబిలిటీ 6×6 గన్ టోయింగ్ వాహనాల సేకరణ కోసం భారత ప్రభుత్వం భారత్ ఫోర్జ్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్‌తో రూ. 6,900 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. ఈ తుపాకుల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. వీటిని ప్రవేశపెట్టడం వల్ల భారత సైన్యం పాత ఫిరంగులను ఈ స్వదేశీ తుపాకులతో భర్తీ చేయగలదు.
ఇక ఈ ఆర్టిలరీ గన్ బరస్ట్ ఫైరింగ్ మోడ్‌లో 2.5 నిమిషాలలోపు 5 రౌండ్లు కాల్చగలదు. మందుగుండు సామగ్రిని ఉపయోగించి 48.07 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించింది. ఈ ఆయుధాలను ఎంత త్వరగా మొహరించవచ్చో అంతే త్వరగా.. తిరిగి తీసుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కూడా వీటిని వినియోగించవచ్చు. ఈ ఆయుధాలకు జీపీఎస్ టెక్నాలజీ కూడా ఉండటం విశేషం.