Renu Desai: రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారా..?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ (Renu Desai) రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో (Podcast interview) ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు తెరలేపాయి. తన జాతకంలో రాజకీయ యోగం ఉందని, గతంలో రాజకీయాల్లోకి రావడానికి (political entry) అవకాశం వచ్చినప్పటికీ, పిల్లలు చిన్నవారై ఉండటం వల్ల వాటిని వదులుకున్నానని ఆమె తెలిపారు. నా జాతకంలో రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పారని.. నాకు సేవ చేయాలనే ఆసక్తి కూడా ఉందన్నారు. కానీ గతంలో పిల్లల కోసం ఆ అవకాశాన్ని తీసుకోలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రేణు దేశాయ్ – పవన్ కల్యాణ్ 2009లో వివాహం చేసుకున్నారు. 2012లో విడాకులు తీసుకున్నారు. తర్వాత మరాఠీ సినిమాల్లో నటన, దర్శకత్వం, కాస్ట్యూమ్ డిజైనింగ్ వైపు వెళ్లిపోయారు. అదే సమయంలో శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ (Sri Aadya Animal Shelter) అనే ఎన్జీవో (NGO) ద్వారా జంతు సంరక్షణలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ సామాజిక కార్యకలాపాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. బహుశా రాజకీయాల్లోకి రావాలనుకునేందుకు ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చు. ఒకవేళ ఆమె రాజకీయాల్లోకి వస్తే, ఏ పార్టీలో చేరతారనే చర్చ జోరుగా సాగుతోంది. కొందరు ఆమె భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంటర్వ్యూలో రేణు దేశాయ్, ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అంటే తనకెంతో గౌరవం ఉందన్నారు. ఆయన సేవా దృక్పథాన్ని గౌరవిస్తానని చెప్పారు. దీంతో ఆమె బీజేపీలో చేరవచ్చని ఊహించుకుంటున్నారు.
అయితే రాజకీయ ప్రవేశంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, తన వ్యక్తిగత జీవితం, పిల్లల సంక్షేమంపై దృష్టి సారించినానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాల్లో తాను సరిపోనని తన స్నేహితులు నవ్వుతుంటారని రేణు దేశాయ్ వెల్లడించారు. తాను నిజాయితీగా మాట్లాడతానని.. రాజకీయాల్లో ఇలా మాట్లాడితే సరిపోదని వారంటూ ఉంటారన్నారు. ఈ ఏడాది జనవరిలో విజయవాడలో భారత చైతన్య యువజన పార్టీ (BCYP) నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దీన్ని బట్టి ఆమె రాజకీయాలపట్ల ఆసక్తి ఉందని అర్థమవుతోంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్నా ఇప్పటికైతే ఆమె ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఈ వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఒకవేళ రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో గత వైవాహిక సంబంధాలను ప్రత్యర్థులు రాజకీయ అస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ను ఈ అంశంపై సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉంటారు. వాటిని రేణు దేశాయ్ తట్టుకుని నిలబడగలదా అనేది చెప్పలేం. ఇప్పటికైతే ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు అందరికీ చెప్తానని ఆమె ఇంటర్వ్యూలో తెలిపారు. దీన్ని బట్టి ఆమె బీజేపీలో చేరబోతున్నారనేది ఇప్పటికైతే ఊహాగానమే.!