Chennai: తమిళనాట పొత్తు పొడిచింది.. కమలంతోనే అన్నాడీఎంకే…

తమిళనాడు(Tamil Nadu)లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే(AIADMK), బీజేపీ(BJP) మధ్య మరోసారి పొత్తు కుదిరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly Elections) వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తుపై అమిత్ షా ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. తమిళనాడు పర్యటనలో ఉన్న అమిత్ షా.. అన్నాడీఎంకే చీఫ్, మాజీ సీఎం పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పళనిస్వామి సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.
గతంలోనూ ఈ రెండు పార్టీలు జతకట్టి ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఆ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. దీంతో అన్నాడీ ఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రస్తుతం.. తాజాగా వచ్చే ఎన్నికల్లోనూ ఇరు పార్టీలూ కలిసిపోటీ చేయనున్నాయి. అవసరమైతే.. కనీస ఉమ్మడి పథకం రూపొందిస్తామని అమిత్ షా తెలిపారు. 1998లో నాటి సీఎం జయలలిత నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పాటైనప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం సాధించాని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు.
ఈ పొత్తు కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని అమిత్ షా తెలిపారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమన్నారు. ఈ పొత్తు ఎన్‌డీఏ, అన్నాడీంఎకేకు మేలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపు, తదితర అంశాలను తర్వాత నిర్ణయిస్తామన్నారు. తమిళనాడులో డీఎంకే అసలైన సమస్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తీసుకొస్తోందని అమిత్ షా విమర్శించారు.