Supreme Court: నటుడు దర్శన్, పవిత్రా గౌడ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

తమ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన నటుడు దర్శన్ (Darshan), నటి పవిత్రా గౌడ (Pavithra Gowda) కు సుప్రీంకోర్టు (Supreme Court ) లో గట్టి షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెల్లడిరచింది.దీంతో అప్రమత్తమైన బెంగళూరు పోలీసులు తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే వీరిద్దరినీ అరెస్టు చేశారు. తొలుత పవిత్రా గౌడను ఆమె ఇంట్లోనే కస్టడీలోకి తీసుకోగా, ఆ తర్వాత దర్శన్‌ను అరెస్టు చేశారు. చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నటి పవిత్ర గౌడ, ప్రముఖ నటుడు దర్శన్ ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో గతేడాది డిసెంబర్‌లో కర్ణాటక (Karnataka) హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేయగా, దీన్ని రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక పోలీసులు గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులను కస్టడీలోకి తీసుకొని త్వరగా విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్తానం అధికారులను ఆదేశించింది.