West Bengal: రోజుల పసికందు ప్రాణాలు కాపాడిన వీధికుక్కలు..
ఇటీవలి కాలంలో ఎక్కడ చూసిన కుక్కల దాడులు.. పెరిగిన దాడులతో జనం బెంబేలెత్తుతున్నారు. ఆఖరుకు సుప్రీంకోర్టులు సైతం రూలింగ్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే దీనికి భిన్నంగా పశ్చిమబెంగాల్ లోని పురూలియాలో ఓ అద్భుతం జరిగింది.తనకు బిడ్డ అక్కర్లేదని ఓతల్లి రోజుల పసిబిడ్డను రోడ్డుపై వదిలేస్తే.. నాలుగు వీధికుక్కలు. ఆచిన్నారిని సంరక్షించాయి. అవి ఆ చిన్నారి చుట్టూ రక్షణ వలయంగా కూర్చొని.. కాకులు, గద్దల నుంచి రక్షించాయి. తెల్లవారే వరకు అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాయడం స్థానికులను ఆశ్చర్య పరిచింది.
నవంబర్ 29వ తేదీ అంటే శనివారం రోజు ఉదయం పాఠశాల ఉపాధ్యాయుడు ఉల్హాస్ చౌదరి.. ప్రతిరోజూ లాగే బడికి వెళ్తున్నారు. అయితే తన ఇంటి నుంచి అలా నడుచుకుంటూ వెళ్లగా.. పాఠర్ది పారా ప్రాంతంలోని పొదల్లోంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆయన ఇదెక్కడి నుంచి వస్తుందోనని చుట్టూ తిరిగి చూశారు. తన వెనకా ముందూ, పక్కన ఎవరూ లేకపోవడంతో.. చిన్నారి ఏడుపు ఎక్కడి నుంచి వినిపిస్తుందో వెతకడం ప్రారంభించారు. ఈక్రమంలోనే ఓ నాలుగు వీధి కుక్కలు దేనిచుట్టో తిరగడం గమనించారు. దీంతో వెంటనే వెళ్లి చూడగా.. అక్కడ ఓ చిన్నారి కనిపించింది.
ముఖ్యంగా లేత గులాబీ రంగు గుడ్డలో చుట్టి ఉన్న నవజాత శిశువుకు.. ఆ నాలుగు కుక్కలు కాపలా కాయడాన్ని చూసి షాకయ్యారు. కాకులు, గద్దలు చిన్నారి దగ్గరకు వస్తుంటే.. అరుస్తూ వాటిని అక్కడి నుంచి అవి వెళ్లగొట్టడాన్ని చూసి చౌదరి ఆశ్చర్యపడ్డారు. వెంటనే చిన్నారి దగ్గరకు వెళ్లగా.. వీధి కుక్కలు సైతం తోక ఆడిస్తూ అక్కడే కూర్చుండిపోయాయి. చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న చౌదరి.. స్థానికులకు చెందిన శిశువు అయ్యుండొచ్చని అక్కడి వారందరికీ సమాచారం ఇచ్చారు. అంతా హుటాహుటిన అక్కడికి చేరుకుని చిన్నారిని, కుక్కలు కాపలా కాయడం గురించి తెలుసుకుని షాకయ్యారు.
ముఖ్యంగా చిన్నారి గుక్కపెట్టి ఏడుస్తుండడం చూసిన పర్వీన్ సేన్ అనే మహిళ.. చిన్నారిని తీసుకుని పాలు పట్టింది. ఆమెకు కూడా ఏడాది వయసున్న బాబు ఉండగా.. శిశువు ఆకలి తెల్సుకుని ఆ పని చేసింది. ఆపై వీరంతా కలిసి చిన్నారిని చౌదరి ఇంటికి తీసుకెళ్లారు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. వారు చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించారు. మరోవైపు చిన్నారిని ఎక్కడికి తీసుకు వెళ్తే కుక్కలు కూడా అక్కడికే వెళ్లాయి. చిన్నారిని చౌదరి ఇంట్లో ఉంచగా.. వీధి శునకాలు ఇంటి బయటే నిల్చున్నాయి.
చిన్నారిని తమ ఆధీనంలోకి తీసుకొని దేబెన్ మహతో సదర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆ చిన్నారికి ఏడు నుంచి పది రోజుల వయసు ఉంటుందని.. ప్రస్తుతం 2.8 కిలోల బరువు ఉందని ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని తేల్చారు.






