Tahawwur Rana: విచారణలో సమాధానాలు దాటేవస్తున్న తహవ్వుర్ రాణా

అమెరికా నుండి భారత్‌కు తీసుకొచ్చిన 26/11 ముంబయి ఉగ్రదాడి కేసు కీలక నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Rana) ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పర్యవేక్షణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇటీవలే అతడిని ప్రశ్నించారు. అయితే, ఈ విచారణలో తహవ్వుర్ రాణా సరిగ్గా సహకరించడం లేదని, అడిగే ప్రశ్నలకు దాటవేసే ధోరణిలో సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఈ విచారణలో ముంబై ఉగ్రదాడులకు (26/11 Mumbai Attack) తనకు ఎలాంటి సంబంధం లేదని రాణా (Tahawwur Rana) వాదించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన ‘ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్’ పూర్తిగా చట్టబద్ధమైనదని, దానికీ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేదని రాణా చెప్పాడట. ఇలా విచారణకు సహకరించకుండా తప్పించుకునేలా సమాధానాలు ఇస్తున్నట్లు సంబంధిత అధికార వర్గాలు కోర్టుకు తెలిపాయి. ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అనేది రాణాకు చెందిన ఒక వ్యాపార సంస్థ. ఈ క్రమంలో త్వరలోనే తహవ్వుర్ రాణాపై అభియోగపత్రం దాఖలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నుండి ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక బృందం రాణాను (Tahawwur Rana) భారత్‌కు తీసుకువచ్చింది. అతడిని 18 రోజుల పాటు కస్టడీలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల తన కుటుంబంతో మాట్లాడేందుకు అనుమతి కోరుతూ వేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.