DMK: బిల్లులపై గవర్నర్ పవర్స్ కు బ్రేక్: సుప్రీం తీర్పుతో డీఎంకేకు మద్దతు..

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly elections) సమీపిస్తున్న వేళ డీఎంకే (DMK) పార్టీకి ఫుల్ జోష్ తెచ్చే కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం సుప్రీంకోర్టు (Supreme court) ఇచ్చిన తీర్పుతో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట లభించింది. గత రెండేళ్లుగా సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఒక ముఖ్యమైన వ్యవహారంపై ఈ తీర్పు వెలువడింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం ప్రతిపాదించిన 10 బిల్లులను (Government bills) గవర్నర్ ఆమోదించకుండానే చట్టాలుగా మారిపోయేలా తీర్పు రావడం సంచలనంగా మారింది. ఇది దేశంలో అరుదుగా జరిగే ఒక కొత్త పరిణామానికి నాందిగా భావిస్తున్నారు.
ఈ తీర్పుతో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రవేశపెట్టే బిల్లులను గవర్నర్‌లు అడ్డుకోవడం సాధ్యపడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బిల్లులపై మార్పులు సూచించవచ్చునే తప్ప పూర్తిగా ఆమోదించకుండా ఆపేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను నిర్ణీత సమయంలోలోపు గవర్నర్ ఆమోదించాల్సిందేనని, లేదా నెల రోజుల్లో రాష్ట్రపతికి పంపాలన్న నిబంధన మాత్రమే ఉందని కోర్టు తేల్చింది. అంతేకాదు, రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి వద్దకు పంపే అధికారం గవర్నర్‌కు లేదని సుప్రీంకోర్టు వివరంగా చెప్పింది.
ఈ తీర్పుతో తమిళనాడు ప్రభుత్వం సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) నాయకత్వంలో నడుస్తున్న డీఎంకే ప్రభుత్వం ఇటీవల కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. హిందీ భాషను బలవంతంగా రుద్దడం, దక్షిణాదిపై అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలతో కేంద్రాన్ని తరచూ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతేడాది అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ ఆమోదించక ఆలస్యం చేయడం వివాదాస్పదంగా మారింది.
ఈ వివాదంపై డీఎంకే ప్రభుత్వం 2024లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పు రావడంతో రాజకీయంగా వారు బలపడినట్టైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న పాలనాపరమైన నిర్ణయాలకు కొత్త దారి చూపించిందని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమయం గడిపేస్తూ బిల్లుల ఆమోదాన్ని నిలిపివేయడం రాజ్యాంగ విలువలకు భంగం కలిగించేదిగా భావించిన కోర్టు తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.