జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు … అలా చేస్తే ఆపేస్తాం
రెండున్నరేళ్లకు పైగా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అంతుపట్టట్లేదు. అటు కీవ్ సైనికులు కూడా రష్యా దూకుడును ఎదుర్కోలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఈ పరిణామాల వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్ అధీనంలో ఉన్న భూభాగాన్ని నాటో పరిధిలోకి తీసుకొస్తే యుద్ధాన్ని ముగించే అవకాశాలున్నాయని వెల్లడించారు. యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలి. అప్పుడే మేం కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని (రష్యా ఆక్రమిత ప్రాంతాలతో కలిపి) నాటోలో చేర్చుకోవాలి. అలాగే జరిగితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుంది అని జెలెన్స్కీ వెల్లడిరచారు.






