Telangana BJP: గేర్ మార్చిన తెలంగాణ బీజేపీ.. మున్సిపల్ ప్రచారానికి అమిత్ షా, నితిన్ నబీన్..!
తెలంగాణ రాజకీయ యవనికపై ప్రత్యామ్నాయం మేమే అని విర్రవీగిన భారతీయ జనతా పార్టీకి, గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఒక గట్టి హెచ్చరికను పంపాయి. ఒకప్పుడు రాష్ట్రంలో నెంబర్ 2 స్థానానికి ఎదిగామని, ఇక అధికారమే తరువాయి అని సంబరపడ్డ కమలదళానికి.. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఇంకా అట్టడుగునే ఉందన్న చేదు నిజం బోధపడింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలను బీజేపీ తన ఉనికి చాటుకునేందుకు, పోగొట్టుకున్న ప్రతిష్టను తిరిగి పొందేందుకు ఒక అగ్నిపరీక్షగా భావిస్తోంది.
ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం బీజేపీ అధిష్టానం ఈసారి వ్యూహాన్ని మార్చింది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర నాయకత్వానికి వదిలేసే కేంద్ర పెద్దలు, ఈసారి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన కొత్త టీమ్‌తో ఇప్పటికే కసరత్తు ప్రారంభించగా, చాణక్యుడిగా పేరుగాంచిన అమిత్ షా స్వయంగా ప్రచార పర్వంలో పాల్గొంటుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్ నగర్ లేదా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్ పట్టణాల్లో వీళ్ల భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు జరుగుతుండటం.. బీజేపీ ఈ ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేస్తోంది. మున్సిపాలిటీలపై జెండా ఎగురవేస్తే తప్ప, వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
బీజేపీ వెనుకబాటుకు ప్రధాన కారణం బయటి శత్రువుల కంటే ఇంట్లోని విభేదాలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో పాత నాయకులకు, కొత్తగా చేరిన వలస నాయకులకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా స్థాయిలో గ్రూపు రాజకీయాలు పార్టీ కేడర్‌ను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ వంటి జిల్లాల్లో ఇటీవల జరిగిన దాడులు, గొడవలే ఇందుకు నిదర్శనం. అధిష్టానం ఎన్ని ఆదేశాలిచ్చినా, రాష్ట్ర నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో క్షేత్రస్థాయి కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. ఈ చలనం లేని కేడర్‌లో జోష్ నింపేందుకే అమిత్ షా వంటి అగ్రనేతలను బరిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగినా అది విజయతీరాలకు చేర్చకపోవడంతో పార్టీ మేధోమథనంలో పడింది.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఈసారి ‘అర్బన్ ఓటర్ల’పైనే ఆశలు పెట్టుకుంది. కేంద్ర పథకాల లబ్ధిదారులు, మధ్యతరగతి ప్రజలే తమను గట్టెక్కిస్తారని నమ్ముతోంది. నితిన్ నబీన్ నాయకత్వంలో మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ వంటి నేతలను ఇన్‌ఛార్జులుగా నియమించడం ద్వారా ఇతర రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలను ఇక్కడ అమలు చేయబోతున్నారు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల మధ్య బీజేపీ తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటుందనేది ప్రశ్నార్థకం. కేవలం అగ్రనేతల పర్యటనలతోనే ఓట్లు రాలతాయా? లేక గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి నాయకత్వం ఐక్యంగా ముందుకు సాగుతుందా? అనేది వేచి చూడాలి.
బీజేపీకి ఈ మున్సిపల్ ఎన్నికలు కేవలం గెలుపోటములకు సంబంధించినవి మాత్రమే కాదు.. తెలంగాణలో ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపు. అమిత్ షా రాకతో పార్టీలో జోష్ రావచ్చు కానీ, ఆ జోష్ ఓట్ల రూపంలోకి మారాలంటే స్థానిక నేతలు అహంభావాన్ని వీడి ఐక్యంగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే నెంబర్ 2 కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.






