KCR: కేసీఆర్కు సిట్ నోటీసులు..! రేపు పాంహౌస్లోనే విచారణ..!?
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇప్పటివరకు రెండో శ్రేణి నాయకులు, అధికారులకే పరిమితమైన ఈ సెగ, ఇప్పుడు నేరుగా గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి తలుపు తట్టింది. నేడో రేపో కేసీఆర్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో గత కొద్దిరోజులుగా సిట్ దూకుడు పెంచింది. కేసీఆర్ కుటుంబానికి, పార్టీకి అత్యంత సన్నిహితులైన ముగ్గురు కీలక నేతలను ఇప్పటికే అధికారులు జల్లెడ పట్టారు. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను విచారించిన సిట్… ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. వీరి ముగ్గురినీ సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. అంటే సాక్షులుగా విచారించే అధికారం కింద నోటీసులు ఇచ్చి, గంటల తరబడి విచారించారు. వీరి నుంచి సేకరించిన సమాచారం, అలాగే అరెస్టయిన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగానే ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, కేసీఆర్ను కేవలం ఫోన్ ట్యాపింగ్ ప్రధాన కేసులోనే కాకుండా, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన అధికార దుర్వినియోగం, రికార్డుల ధ్వంసం కేసులో కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి కీలక నేతలను విచారించేటప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా లేదా వారి హోదాను పరిగణనలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి కాకుండా, వారి నివాసానికే వెళ్లి విచారించే సంప్రదాయం ఉంది. ఈ క్రమంలోనే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ లోనే ఈ విచారణ ప్రక్రియ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు ఎర్రవల్లికి బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ నోటీసులు ఇచ్చి రేపు ఫాంహౌస్ లోనే కేసీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది.
గతంలో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులకు ఇచ్చినట్లే సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసీఆర్కు నోటీసులు ఇస్తారా? లేక విచారణ తీరును బట్టి వేరే సెక్షన్లను పరిగణనలోకి తీసుకుంటారా? అన్నది ఉత్కంఠగా మారింది. ప్రధానంగా, ఇంటెలిజెన్స్ అధికారులకు సీఎంఓ (CMO) నుంచి ఏవైనా మౌఖిక ఆదేశాలు అందాయా? రాజకీయ ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచాలని ప్రత్యేకంగా ఎవరికైనా సూచించారా? ప్రభుత్వ మార్పు సమయంలో కీలక డేటా ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? అనే అంశాలపై కేసీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉంది.
ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపిస్తోంది. ఇప్పటికే కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు. ఈ విచారణ పరంపర చివరకు కేసీఆర్ వద్దకే చేరుతుందని తమకు ముందే తెలుసని వ్యాఖ్యానించారు.
మరోవైపు, అధికార పక్షం మాత్రం.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తోంది. వేల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తులు, జడ్జీలు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనికి బాధ్యులైన వారు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది.
తెలంగాణ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై విచారించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఒకవేళ కేసీఆర్ను విచారిస్తే, అది రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలకు దారితీస్తుంది. ఈ విచారణ కేవలం ఒక ప్రక్రియగా ముగుస్తుందా? లేక కేసులో కొత్త నిందితుల చేరికకు దారితీస్తుందా? అన్నది వేచి చూడాలి.






