AP Budget Session: ఎమ్మెల్యేల బాధ్యతపై బిల్లుకు రంగం సిద్ధం… ఏపీ అసెంబ్లీలో కీలక చర్చలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు స్పష్టమైన ముహూర్తం ఖరారైంది. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రులతో విస్తృతంగా చర్చించారు. అన్ని శాఖల నుంచి బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే అందాయని, వాటిపై అవసరమైన కసరత్తు కూడా దాదాపుగా పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 11 నుంచి సమావేశాలు ప్రారంభిస్తే అనుకూలంగా ఉంటుందని సీఎం సూచించగా, మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అయితే సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలన్న అంశంపై సభ ప్రారంభమైన రోజే బీఏసీ (Business Advisory Committee)లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన తేదీగా ఫిబ్రవరి 14ను నిర్ణయించారు. ఆ రోజున 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రత్యేక బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సమర్పించనున్నారు. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమానికి సమతూకం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం.
ఈ సమావేశాల్లో కేవలం బడ్జెట్‌కే పరిమితం కాకుండా పలు కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గంతో చర్చలు జరిపారు. అందులో ముఖ్యంగా ఇటీవల కాలంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) ప్రస్తావిస్తున్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో ప్రస్తుతం ఉన్న చట్టాల్లో స్పష్టత లేకపోవడాన్ని ఆయన పలుమార్లు గుర్తుచేస్తున్నారు.
ప్రస్తుత చట్టాలు లేదా రాజ్యాంగంలో సభకు హాజరు కాని ఎమ్మెల్యేల వేతనాలు, భత్యాలు నిలిపివేయడం లేదా ఇతర చర్యలు తీసుకునేలా ఎలాంటి స్పష్టమైన క్లాజ్ లేదని స్పీకర్ అభిప్రాయం. రాజ్యాంగ నిర్మాతలు ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తారని భావించి ఇలాంటి పరిస్థితులను ఊహించలేదని ఆయన వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా చర్యలు తీసుకోవాలన్న దానిపై చట్టపరమైన మార్గం అవసరమని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బిల్లును రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తాజా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లు ఆమోదమై కేంద్రానికి పంపితే, దేశంలో ఈ తరహా చట్టాన్ని ప్రతిపాదించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. దీని ద్వారా కేంద్రం కూడా ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని గైర్హాజరయ్యే ఎమ్మెల్యేలపై చర్యలకు వీలు కల్పించే చట్టాన్ని రూపొందించే అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే రానున్న బడ్జెట్ సమావేశాలు కేవలం ఆర్థిక అంశాలకే కాదు, శాసనసభ పనితీరులో బాధ్యత పెంచే కీలక నిర్ణయాలకు కూడా వేదిక కావొచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.






