మరో ఆల్ రౌండర్ ఎవరు…? గంభీర్ ముందు అగ్ని పరీక్ష…!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ విషయంలో పూర్తిస్థాయిలోకి కసరత్తు చేస్తోంది. జట్టుకూర్పు విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలి అనే దానిపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అడిలైడ్ లో భారత్ కు కచ్చితంగా ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఎటాక్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కాట్ బొలాండ్ ఆస్ట్రేలియా తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
గత ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్కాట్… భారత్ ను దెబ్బతీశాడు. దీనితో అతని ఎదుర్కోవడానికి రోహిత్ సేన ఇప్పుడు వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలో తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటే మంచిది అనే దానిపై కోచ్ గౌతమ్ గంభీర్ సీనియర్ ఆటగాళ్లతో చర్చిస్తున్నాడు. యువ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి స్థానం ఖరారు అయినా… స్పిన్ ఆల్ రౌండర్ ఉంటే మంచిదని భావిస్తున్నారు. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లను తుది జట్టులోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు.
ప్రస్తుతం తుది జట్టులో ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నాడు. తొలి టెస్ట్ లో అతను బ్యాటింగ్లో పర్వాలేదనిపించాడు. అయితే బౌలింగ్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రెండో ఇన్నింగ్స్ లో పిచ్చి బౌలింగ్ సహకరించడంతో సుందర కాస్త పరవాలేదు అనిపించినా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు అనే ఆందోళన భారత శిబిరంలో నెలకొంది. దీనితో అతని స్థానంలో సీనియర్ అశ్విన్ ను తీసుకుంటే బ్యాటింగ్ కు కూడా సహకరిస్తాడు అనే ఆలోచలో రోహిత్ శర్మ ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే లోయర్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే మాత్రం జడేజాతో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ మెరుగ్గా రాణిస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కావాలి అంటే జడేజా మినహా ఆప్షన్ లేదు. దీనితో ఎవరిని తీసుకుంటారో క్లారిటీ లేదు. సుందర్ ను తుది జట్టులో కొనసాగించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే జట్టులో లెఫ్ట్ హ్యాండర్ లు ముగ్గురు ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ మిడిల్ ఆర్డర్లో సీనియర్ ఆటగాడు రిషబ్ పంత్ ఉండగా లోయర్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ను తీసుకుందామా వద్దా అనే దానిపై ఇప్పుడు కోచ్ గంభీర్ కసరత్తు చేస్తున్నాడు. అయితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని రోహిత్ శర్మ వ్యక్తం చేసినట్టుగా సమాచారం.
అశ్విన్ తుది జట్టులో ఉంటే కెప్టెన్ కు కూడా పని సులువు అవుతుంది. దీనితో అశ్విన్ లో తీసుకోవాలని రోహిత్ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే అడిలైడ్ ఓవల్ మైదానం పేస్ బౌలింగ్ ఎటాక్ కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లను తీసుకోవాలా వద్దా అనే దానిపై గంభీర్ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అశ్విన్ స్థానంలో ఆకాశదీప్ ను తీసుకుంటే మంచిది అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనితో తుదిజట్టు కూర్పు ఇప్పుడు సందిగ్ధత నెలకొంది.






