పుతిన్‌కు మీరైనా చెప్పండి.. భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
భారతదేశానికి దీర్ఘకాలంగా రష్యాతో అద్వితీయ బంధం ఉందనీ, ఉక్రెయిన్‌పై అక్రమ యుద్ధాన్ని విరమించేలా వ్లాదిమిర్ పుతిన్‌కు నచ్చచెప్పడానికి భారత్ ఆ బంధాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా కోరింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతవారం మాస్కో వెళ్లి పుతిన్‌తో సమావేశమవడం గురించి ప్రశ్నించినప్పుడు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాధానమిచ్చారు. ఐక్యరాజ్యసమితి నిబంధనావళిని, ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్నీ గౌరవించాల్సిందిగా పుతిన్‌కు హితవు చెప్పాలని మోదీని కోరామని మిలర్ తెలిపారు. భారతదేశం అమెరికాకూ ముఖ్యమైన భాగస్వామి అని వివరించారు. భారత ప్రధాని మోదీ జులై 8, 9 తేదీలలో రష్యాను సందర్శించారు. పుతిన్‌తో సమావేశమైనప్పుడు ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం యుద్ధ రంగంలో లభించదనీ, బాంబులు, బుల్లెట్ల మధ్య శాంతిని సాధించలేమనీ చెప్పారు.






