కీలకమైన బిల్లుకు.. అమెరికా సెనెట్ ఆమోదం

అమెరికా పరిశోధనల్లో చైనా పెత్తనాన్ని నిరోధించే కీలకమైన బిల్లుకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. డెమొక్రాటిక్ సెనేటర్ చక్ ఘమర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వటంతో 68-32 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. యూఎస్ ఇన్నోవేషన్, కాంపిటేషన్ చట్టంగా పిలిచే ఈ చట్టం కారణంగా 100 బిలియన్ డాలర్ల నిధులను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు వినియోగిస్తారు. తద్వారా ఆర్థిక, శాస్త్రసాంకేతిక రంగాల్లో అమెరికాను అగ్రభాగంలో నిలపాలన్నది ఉద్దేశం. చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధన సంస్థల్లో, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తమ ఆవిష్కరణలను, ఆలోచనలను దొంగిలిస్తోందని బిల్లులో పేర్కొన్నారు.
ఇక నుంచి విదేశీ నిధులపై ఆధారపడకుండా, అమెరికాయే పుష్కలంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు నిధులు సమకూర్చేందుకు తాజా బిల్లు అవకాశం కల్పిస్తుంది. ప్రతి నిధుల సభ కూడా దీనికి ఆమోద ముద్ర వేస్తే.. ఇది అధ్యక్షుడు బైడెన్ వద్దకు వెళ్తుంది. తైవాన్‍కు స్వాతంత్య్రం, హాంకాంగ్‍లో మానవహక్కులను చైనా అణచివేయటం, షిన్‍జియాంగ్ రాష్ట్రంలో ముస్లింలపై అణచివేతలు, టిబెట్ వ్యవహారాలను కూడా ఈ బిల్లు సందర్భంగా ప్రస్తావించారు. ఈ బిల్లుకు ఆమోదంపై చైనా తీవ్రంగా విరుచుకుపడింది. అమెరికా ప్రచ్ఛన్న యుద్దకాలంనాటి మానసిక స్థితిలో ఉందని విమర్శించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే అవసరం అమెరికాకు లేదని స్పందించింది.