Trump: ఖతార్ తో జాగ్రత్త.. మా మిత్రదేశం సుమీ.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన..

సమ్మిట్ ఆఫ్ ఫైర్ పేరుతో ఖతార్ లో ఇజ్రాయెల్ చేసిన దాడుల సెగ అమెరికాను తాకింది. ఖతార్ పై దాడికి సంబంధించిన విషయాలను.. అగ్రరాజ్యంతో పంచుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే తాము సమాచారం అందిన వెంటనే..ఖతార్ కు ఫోన్ చేశామని అమెరికా ప్రతినిధులు తెలిపారు. అయితే దాడులు ప్రారంభమైన పది నిముషాల తర్వాతే తమకు అమెరికా నుంచిఫోన్ కాల్ వచ్చిందన్నారు ఖతార్ ప్రతినిధులు. దీంతో అసలు ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది.
గత వారం గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా (US) చేసిన ప్రతిపాదనలపై చర్చించేందుకు దోహా (Doha)లో సమావేశమైన హమాస్ నేతలపై ‘సమ్మిట్ ఆఫ్ ఫైర్’ పేరుతో ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) స్పందించారు. ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని.. దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఖతార్ (Qatar) ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ హమాస్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ ఖతార్ జోలికి మాత్రం వెళ్లొద్దని అన్నారు.
కాల్పుల విరమణకు సంబంధించి యూఎస్ ప్రతిపాదన మేరకు ఇటీవల దోహాలో ఖతార్ (Qatar) అధికారులు, హమాస్ నేతలు భేటీ అయ్యారు. వీరి మధ్య చర్చలు జరుగుతుండగానే ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో వారెవరూ ప్రాణాలు కోల్పోలేదు. అయితే, ఈ దాడులను ఖతార్ తీవ్రంగా పరిగణించింది. మధ్యవర్తిత్వ సూత్రంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. కాగా భారత్‌తో సహా పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి. మరోవైపు- అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదివారం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు.
అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) మాత్రం తాము చేసిన దాడులను సమర్థించుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడులను.. అమెరికా (USA)లో జరిగిన 9/11 దాడులతో పోల్చారు. ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. హమాస్‌తో యుద్ధానికి దారితీసిన అక్టోబరు 7 నాటి దాడులను ఆయన ప్రస్తావించారు. వీటిని అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోల్చుతూ.. నాడు యూఎస్ ఎలా స్పందించిందో ప్రస్తుతం తాము అలాగే చేశామన్నారు.