Jagan Vs Sajjala: వైసీపీలో సజ్జల స్పీడ్‌కు బ్రేకులు..!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అంటే మనకు గుర్తుకొచ్చేది వై.ఎస్.జగన్. ఆ పార్టీలో అన్నీతానే.! జగన్ (YS Jagan) తర్వాత ఎవరంటే ఇంతకుముందు విజయసాయి రెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) తప్ప మరో పేరు కనుచూపు మేరలో కనిపించదు. ఇంక విధంగా చెప్పాలంటే పార్టీ వ్యవహారాలన్నింటినీ జగన్ కంటే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డే చక్కబెడుతుంటారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు. టాప్ టు బాటమ్ అన్ని పనులనూ ఆయనే పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సజ్జల స్పీడ్ కు జగన్ బ్రేకులు వేస్తున్నట్టు సమాచారం. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ కాంక్లేవ్ (Conclave) లో సజ్జల మాట్లాడిన మాటలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
రెండు రోజుల క్రితం మంగళగిరిలో జరిగిన ఒక సమావేశంలో అమరావతి రాజధాని అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. “అమరావతి (Amaravati) భవిష్యత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) చేతిలో ఉంది. మూడు-నాలుగేళ్లపాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ సమయంలో అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబుదే. గతంలో ఆయన రాజధానిని అభివృద్ధి చేయలేకపోయారు. ఇప్పటికైనా అభివృద్ధి చేయాలి. వైసీపీ అధికారంలోకి వచ్చినా, అమరావతి నుంచి రాజధాని మారదు. మా నాయకుడు జగన్ ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు. అయితే, రాజధాని నిర్మాణంపై లక్షల కోట్లు ఖర్చు చేయడం మా నాయకుడి అభిమతం కాదు. గుంటూరు-విజయవాడ మధ్య మహానగరాన్ని అభివృద్ధి చేస్తాం, రైతులకు ప్లాట్లు ఇస్తాం.” అని సజ్జల అన్నారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించాయి. రాజధానిపై జగన్ యూటర్న్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాతో పాటు కూటమి అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. అదే సమయంలో వైసీపీ సొంత మీడియా మాత్రం సజ్జల వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోలేదు. తమకేమీ తెలీనట్లు మిన్నకుండిపోయాయి. దీంతో సజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా.. లేకుంటే పార్టీ అభిప్రాయమా.. అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ గందరగోళానికి సజ్జలే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే ఆయన్ను పిలిచి గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. రాజధాని లాంటి అంశాలపై నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది.. వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా.. అని గద్దించినట్లు సమాచారం.
సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన సలహాదారుగా పనిచేశారు. అప్పట్లో ఆయన్ను సకలశాఖ మంత్రిగా పిలుచుకునేవారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కోఆర్డినేటర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఆయన వ్యవహార శైలిపై పార్టీలో గతంలోనే అనేక విమర్శలు వచ్చాయి. పార్టీ ఓడిపోవడానికి సజ్జలే కారణమని ఎంతోమంది నేతలు బహిరంగంగానే విమర్శించారు. తమను జగన్ ను కలవనీయకుండా అడ్డుకునేవారని, వాస్తవాలను జగన్ దృష్టికి వెళ్లకుండా సజ్జల అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి సజ్జల అవే విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా రాజధానిపై సజ్జల వ్యాఖ్యలను జగన్ అభిప్రాయంగానే ప్రజలు భావిస్తున్నారని, ఆయన తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతోందని స్పష్టం చేసినట్లు సమాచారం.
సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి వైసీపీలో అంతర్గత అసంతృప్తిని రేకెత్తిస్తోంది. రాజధాని వంటి కీలక అంశంపై స్వతంత్రంగా మాట్లాడడం, పార్టీ అధ్యక్షుడి అభిప్రాయాలను అధిగమించి వ్యవహరించడం వంటివి జగన్‌కు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. పార్టీ పునర్వైభవం కోసం పోరాడుతున్న ప్రస్తుత కీలక సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సజ్జల తీరు మారకపోతే, వైసీపీలో అంతర్గత సమస్యలు మరింత తీవ్రతరం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.