Non-Immigrant Visas: ట్రంప్ వచ్చాక 80,000 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు రద్దు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఏకంగా 80,000 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను రద్దు చేసినట్లు యూఎస్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వివిధ రకాల నేరపూరిత చర్యల కారణంగా ఈ వీసాలు రద్దయినట్లు తెలిపారు. వీసా రద్దుకు ప్రధాన కారణాలలో మద్యం తాగి వాహనం నడపడం (16,000 వీసాలు), ఇతరులపై దాడి (12,000 వీసాలు), దొంగతనం (8,000 వీసాలు) వంటివి కారణాలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే కేవలం ఆగస్టు నెలలోనే 6,000 కంటే ఎక్కువ విద్యార్థి వీసాలు కూడా రద్దు చేయడం జరిగిందని, వాటిలో చాలా వరకు వీసా నిబంధనల ఉల్లంఘించడం వల్లనో లేదా ఉగ్రవాదానికి మద్దతివ్వడం వంటి ఆరోపణలతోనే వీసాలు రద్దు (Non-Immigrant Visas) చేశామని అధికారి తెలిపారు. సంప్రదాయవాద కార్యకర్త చార్లీ కిర్క్ హత్యకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టుల కారణంగా ఆరుగురి వీసాలను రద్దు చేసినట్టు కూడా వెల్లడించారు. ఈ క్రమంలో చిన్న పొరపాటు చేసినా వీసా రద్దవుతుందని లక్షలాది మంది వీసా హోల్డర్లు ఆందోళన చెందుతున్నారు.







