Delhi: వక్ఫ్ సవరణ చట్టంలో కీలక అప్ డేట్.. కొన్ని నిబంధనలపై స్టే విధించిన సుప్రీంకోర్టు..!

వక్ఫ్ (సవరణ) చట్టం-2025 ( Waqf Amendment Act 2025)పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని వివాదాస్పద సెక్షన్లపై మాత్రం స్టే విధించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తి ఉంటే మంచిదని వెల్లడించింది.
వక్ఫ్ చట్టంలో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది.
వక్ఫ్ చట్టంలోని మరో నిబంధన ప్రకారం.. వక్ఫ్‌గా ప్రకటించబడిన ఆస్తి.. ప్రభుత్వ ఆస్తినా కాదా అని నిర్ణయించడానికి కలెక్టర్‌కు అధికారం కల్పించి.. ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని కూడా నిలిపివేసింది. వ్యక్తిగత పౌరుల హక్కులను తీర్పు చెప్పడానికి కలెక్టర్‌కు అనుమతి లేదని.. ఇది అధికారాల విభజనను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీన్ని పిటిషనర్ల తరపు న్యాయవాదులు స్వాగతించారు. తాము చేసిన అన్ని అప్పీళ్లకు కోర్టు నుంచి సానుకూలస్పందన లభించిందన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని దాదాపు 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తిని మెల్లగా లాగేసుకొనేందుకే అని వీటిల్లో ఆరోపించాయి. ఇక కేంద్రం మాత్రం పబ్లిక్, ప్రైవేటు ఆక్రణలకు గురికాకుండా రక్షించడానికి అని వాదించింది. వాస్తవానికి ఈ కేసు ఏప్రిల్‌లో పార్లమెంట్ ఈ బ్లిల్లును క్లియర్ చేసిన గంటల్లోనే సుప్రీంకోర్టుకు చేరింది. ముఖ్యంగా కోర్టులతో వక్ఫ్ ఆస్తిగా గుర్తించినవి, వ్యక్తులు, డీడ్ల ఆధారంగా వక్ఫ్ అయిన ఆస్తుల డీనోటిఫై అధికారాలను దీనిలో ప్రశ్నించారు.