IAS vs MP: బైరెడ్డి శబరి, కార్తికేయ మిశ్రా మధ్య గొడవేంటి..?

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీకి, ఐఏఎస్ అధికారికి మధ్య జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నంద్యాల లోక్‌సభ ఎంపీ బైరెడ్డి శబరి (Byreddy Sabari), సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా (IAS Karthikeya Mishra) మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ కు బైరెడ్డి శబరి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అంతేకాక సీఎం చంద్రబాబు ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య జరిగిన ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.
ఈ నెల 12న రాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితరులు హాజరయ్యారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పార్టీ ఎంపీలంతా వచ్చారు. చంద్రబాబు నివాసానికి పలువురు ప్రముఖులు కూడా విచ్చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు సమయం దగ్గర పడుతుండడంతో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా అక్కడ కొంతమంది ఎంపీలను తొందరపెట్టారు. అదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు తలుపు దగ్గర బైరెడ్డి శబరి వేచి ఉన్నారు. ఆమె అక్కడ వేచి ఉండడాన్ని కార్తికేయ మిశ్రా ప్రశ్నించారు. మీరెందుకు ఇక్కడున్నారు.. వెళ్లిపోండి అని గద్దించారు. దీంతో ఆమె ఆ సమయంలో పక్కకు వచ్చేశారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కార్తికేయ మిశ్రా దగ్గరకు వెళ్లి నిలదీశారు.
తన 15 ఏళ్ల సర్వీసులో ఎవరూ తనను ఇలా ప్రశ్నించలేదని కార్తికేయ మిశ్రా బదులిచ్చారు. తాను కూడా డాక్టర్ గా పనిచేశానని, ఎంతోమంది ప్రాణాలను కాపాడానని, తనతో కూడా ఎవరూ ఇలా ప్రవర్తించలేదని బైరెడ్డి శబరి రిప్లై ఇచ్చారు. వీళ్లద్దరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. మహిళలతో, ఎంపీలతో మాట్లాడటప్పుడు ఒక పద్ధతి ఉంటుందని, ఆ మేరకు నడుచుకోవాలని శబరి గట్టిగానే చెప్పినట్లు సమాచారం. అంతేకాక ఈ గొడవపై మంత్రి నారా లోకేశ్ కు శబరి ఫిర్యాదు చేశారు. సహచర ఎంపీలు కూడా కార్తికేయ మిశ్రాదే తప్పు అన్నట్టు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఆరా తీసిన చంద్రబాబు, సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
డా. బైరెడ్డి శబరి టీడీపీ తరపున నంద్యాల లోక్‌సభ నుంచి గెలుపొందారు. అంతకుముందు ఆమె డాక్టర్ గా పని చేశారు. లోక్ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళా నేత. విపక్షాలను ఎదుర్కోవడంలో, పార్టీ వైఖరిని గట్టిగా చెప్పడంలో శబరి మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఆమెను టీడీపీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేసింది అధిష్టానం. కార్తికేయ మిశ్రా కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి. పదిహేనేళ్లుగా సర్వీసులో ఉన్నారు. ఆయనపై పెద్దగా విమర్శలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన పేరు ఢిల్లీ స్థాయిలో ప్రముఖంగా వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిర్దేశించిన సమయానికి మించి ఎంపీలు సమావేశం కావడం కార్తికేయ మిశ్రాకు కోపం తెప్పించింది. ఒక వైపు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుండడం, ఎంపీలంతా చంద్రబాబుతో ముచ్చటిస్తూ ఉండడంతో ఆయన అసహనానికి గురయ్యారు. అందుకే ఎంపీలతో కాస్త దురుసుగా ప్రవర్తించారు. అదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు వేచి ఉన్న శబరితో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఇది విమర్శలకు తావిచ్చింది. వ్యక్తిగత అంశాలు ఇందుకు కారణం కాకపోయినా, ఓ మహిళా ఎంపీతో ఓ ఐఏఎస్ అధికారి అలా మాట్లాడడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఏదైనా చెప్పేందుకు ఒక పద్ధతి ఉంటుందని సూచిస్తున్నారు.