Asia Cup: ఆసియా కప్‌లో భారత్ జయభేరీ.. పాక్‌పై అలవోక విజయం

ఆసియా కప్‌లో భారత్ (India) అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (Pakistan) పై అలవోక విజయం సాధించింది. ఆసియాకప్ 2025లో భాగంగా దాయాదితో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్లతేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను 127/9కే కట్టడి చేసింది టీమిండియా. కుల్‌దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (18/2), బుమ్రా (28/2) బంతితో అదరగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47*, తిలక్ వర్మ (31; 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు.
ఆసియా కప్ (Asia Cup 2025)లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ (Ind Vs Pak)లు తలపడ్డాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (40) టాప్ స్కోరర్. షాహీన్ అఫ్రిది (33*), ఫకర్ జమాన్ (17), ఫహీమ్ అష్రఫ్ (11), ముఖీమ్ (10) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, అక్షర్ పటేల్, బుమ్రా రెండు చొప్పున, హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు.
టీమ్‌ఇండియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దాయాది జట్టును కట్టడి చేసింది. తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య.. తొలి బంతికే సయిమ్ అయూబ్ (0)ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. రెండో ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో మహమ్మద్ హారిస్ (3) బుమ్రాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్‌లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. 7.4 ఓవర్‌లో ఫకర్ జమాన్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. 13వ ఓవర్‌లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. చివర్లో షాహీన్ అఫ్రిది దూకుడుగా ఆడాడు.