అమెరికా-ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు!

రెండేళ్లకోసారి జరిగే అమెరికా, ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు జులైలో జరుగుతాయని ఆస్ట్రేలియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఎప్పుడు పాల్గొనేవారి సంఖ్యను ఈసారి సగానికి తగ్గిస్తామని తెలిపారు. పైగా కొవిడ్ నేపథ్యంలో కఠినంగా సురక్షిత చర్యలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా రక్షణ బలగాల వైస్ చీఫ్ వైఎస్ అడ్మిరల్ డేవివ్ జాన్‍స్టన్ మాట్లాడుతూ జులైలో యుద్ద విన్యాసాలు జరుగుతాయని కానీ పరిమితంగా వుంటాయని ధ్రువీకరించారు. 2 వేలమంది విదేశీ సైనికులతో పాటు దాదాపు 17 వేల మంది బలగాలు ఇందులో పాల్గొంటాయి. ప్రాథమికంగా ఇది అమెరికా, ఆస్ట్రేలియా పొత్తుకు సంకేతంగా వున్నప్పటికీ ఇందులో ఇతర దేశాల బలగాలు కూడా పాల్గొంటాయి. కెనడా, న్యూజీలాండ్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా దేశాల సైనికులు పాల్గొంటారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా, ఇతర దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి.