Team india: భారత క్రికెట్ జట్టు స్పాన్సర్ గా అపోలో టైర్స్..!

గత నెల రోజులుగా టీం ఇండియాకు కొత్త స్పాన్సర్ ఎవరూ అనే దానిపై పెద్ద ఎత్తున హడావుడి జరుగుతోంది. డ్రీం 11 తప్పుకున్న తర్వాత దీనిపై బోర్డు కొత్త కంపెనీ కోసం మొదలుపెట్టిన వేట పూర్తయింది. డ్రీమ్ 11 స్థానంలో అపోలో టైర్స్(Apollo Tyres) స్పాన్సర్‌షిప్ హక్కులను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్(Asia Cup) లో స్పాన్సర్ లేకుండానే ఆడుతున్న టీం ఇండియా, విండీస్ పర్యటన నుంచి కొత్త స్పాన్సర్ తో ఆడనుంది. ఈ విషయాన్ని మంగళవారం జాతీయ మీడియాకు బిసిసిఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
గత నెలలో పార్లమెంట్ సమావేశాల్లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం.. డ్రీమ్ 11తో సహా రియల్-మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీనితో అక్కడి నుంచి క్రికెట్ జట్టుకు స్పాన్సర్ కరువయ్యారు. స్పాన్సర్‌షిప్ ఒప్పందంలో భాగంగా అపోలో టైర్స్ ఒక్కో మ్యాచ్ కు సుమారు రూ.4.5 కోట్లు ఖర్చు చేస్తుంది. గతంలో డ్రీమ్ 11 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు చెల్లించిన దానికంటే 50 లక్షలు ఎక్కువ. 2027 లో ముగిసే ఈ ఒప్పందం ద్వారా బీసీసీఐ దాదాపు రూ. 600 కోట్లు సంపాదిస్తుంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కాన్వా, జెకె టైర్స్ భారత జట్టుకు స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చినా.. అపోలో టైర్స్ విజేతగా నిలిచింది. బిర్లా ఆప్టస్ పెయింట్స్ కూడా ప్రయత్నం చేసినా ముందుకు రాలేదు. అపోలో టైర్స్ తో ఒప్పందం కుదిరిందని త్వరలోనే దీనిని ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది. బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, పొగాకుకు చెందిన బ్రాండ్‌లను బిడ్డింగ్ నుండి నిషేధించామని బోర్డు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అథ్లెటిజర్, స్పోర్ట్స్‌వేర్ తయారీదారులు, బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు, ఆల్కహాల్ లేని శీతల పానీయాలు, ఫ్యాన్లు, మిక్సర్ గ్రైండర్లు, సేఫ్టీ లాక్‌లు, బీమా కంపెనీలను కూడా అనర్హులుగా ప్రకటించింది బోర్డు.