Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేతల్లో చూపిస్తున్నాం!
చంద్రబాబు గారి వల్లే 15నెలల్లో 10లక్షల కోట్ల పెట్టుబడులు
క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో ఎపి రూపురేఖలు మారిపోతాయి
ఎఐ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు
పరిశ్రమల స్థాపనకు ప్రతిబంధకంగా ఉన్న నిబంధనలు సవరిస్తున్నాం
లండన్: స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నాం, గత 15నెలల్లో రాష్ట్రానికి 10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాం, విజనరీ లీడర్ చంద్రబాబు గారి సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. నవంబర్ 14, 15తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 కు గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు లండన్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరక్టర్స్, పాల్ మాల్ కన్వెన్షన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్ర యూరప్ బిజినెస్ హెడ్ హర్షుల్ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది లీడర్ షిప్ ట్రాక్ రికార్డ్. మాకు సుస్థిరమైన నాయకత్వం ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఆయన అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నారు.
2వది స్పీడ్ ఆఫ్ డూయింగ్ కు మేం ప్రాధాన్యత నిస్తున్నాం. ప్రాజెక్టు ఆరునెలలు ఆలస్యమైతే మొత్తం బిజినెస్ ప్లాన్ దెబ్బతింటుంది. భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ను ఆర్సెలర్ మిట్టల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుచేయబోతోంది. గత ఏడాది జూన్ లో వారితో చర్చలు జరిపినపుడు, వారు మూడు ప్రత్యేక అభ్యర్థనలు చేయగా, కేవలం 12గంటల్లోనే పరిష్కరించాం. నవంబర్ లో ఆర్సెలర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. దేశంలో అతిపెద్ద డాటా సెంటర్ త్వరలో విశాఖపట్నానికి రాబోతోంది. టిసిఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించేందుకే మేం ఎకరా 99 పైసలకే భూములు ఇచ్చాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. 3వది మావద్ద ఉత్సాహవంతంగా పనిచేసే కొత్తతరం యువనాయకత్వం ఉంది. మొత్తం శాసనసభలో 50శాతం తొలిసారి గెలిచినవారు. మంత్రివర్గంలోని 25మందిలో 17మంది కొత్తవారే. వారందరికీ స్టార్టప్ మైండ్ సెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్. మేమంతా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయలన్న తపన, పట్టుదలతో పనిచేస్తున్నాం. విజనరీ లీడర్ చంద్రబాబు గారి నాయకత్వాన గత 15నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగాం. ఎంఓయులతో సరిపెట్టకుండా ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది మా లక్ష్యం. ఇటువంటి సాహసోపేతమైన హామీని దేశంలో మేం మాత్రమే ఇచ్చాం. రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను తెచ్చి, యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా ప్రధాన ధ్యేయం.
దక్షిణ ఆసియాలో తొలి 158 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతికి రాబోతోంది. ప్రధాని మోడీ క్వాంటమ్ మిషన్ ను ముందుండి నడిపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దీనిద్వారా అమరావతిలో అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు కాబోతోంది. విశాఖలో డాటా సిటీ నిర్మాణం వల్ల అక్కడ కేబుల్స్ ల్యాండ్ అవుతాయి. ముంబాయి కన్నా రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్ల డేటా సెంటర్స్ విశాఖకు రాబోతున్నాయి. రాబోయే మూడేళ్లలో అవి పూర్తవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో ఎపి దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సాధించబోతోంది. క్వాంటమ్ వ్యాలీ, డాటా సిటీలతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. ఐటి విప్లవం వల్ల భారతదేశం లబ్ధి పొందింది. ఇప్పుడు ఎఐ సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎఐ ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మేం స్కిల్ అప్ గ్రేడేషన్ కు ప్రాధాన్యత నిస్తున్నాం. కళాశాలలు, యూనివర్సిటీల్లో ఎఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఎఐ గేమ్ చేంజర్ కాబోతోంది. వివిధ పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం తరపున స్కిల్ ఇంటర్వెన్షన్ ను అమలు చేస్తున్నాం. యువతలో నైపుణ్యాలను పెంపొందించి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అక్టోబర్ లో నైపుణ్యం పోర్టల్ ను ప్రారంభించబోతున్నాం.
విజన్ – 2047 లక్ష్యంలో ప్రధానమైన $ 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరుకోవడానికి ప్రతిఏటా సగటున 15శాతం వృద్ధి రేటు సాధించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా మేం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 5వేల ఎకరాల్లో మేం స్పేస్ సిటీని నిర్మించబోతున్నాం. భారత్ లో స్పేస్ ఎక్స్ కు సమానమైన స్కైరూట్ అనే సంస్థకు 300 ఎకరాలు కేటాయించాం. భూమి ధరకు సంబంధించి ఆ సంస్థ విజ్ఞాపనను పరిశీలించి, కేబినెట్ లో చర్చించి కేవలం వారంరోజుల్లో ఆ సంస్థకు భూకేటాయింపులు పూర్తిచేశాం. యుఎస్ అదనపు సుంకాల నేపథ్యంలో సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ముందుకు సాగుతాం. యుకె, రష్యా, యూరప్ లలో కొత్త మార్కెట్లను వెదుక్కుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పెట్టుబడి దారులకు సహకరించేందుకు మేం వందరోజుల ప్రణాళికను అమలు చేస్తున్నాం. అయిదుగురు ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలతో సలహామండలిని ఏర్పాటుచేశాం. పరిశ్రమలస్థాపనలో ప్రతిబంధకంగా ఉన్న కొన్ని నిబంధనలను సవరిస్తున్నాం. ఎపిలో కార్మిక సంస్కరణలు, ల్యాండ్ కన్వర్షన్, నాలా టాక్స్ వంటివి సవరించాలని కేంద్రమంత్రి అశ్వనీ వైష్టవ్ సూచించగా, కేవలం 45రోజుల్లో ఆ సవరణలు పూర్తిచేశామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ రోడ్ షోలో యుకె డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్, టెక్ మహీంద్రా యూరప్ విభాగం ప్రెసిడెంట్ హర్షూల్ అస్నానీ, ఐసిఐసిఐ బ్యాంకు యుకె విభాగం సిఇఓ రాఘవ్ సింఘాల్, ఎపిఐఐసి వైస్ చైర్మన్ & ఎండి అభిషిక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫండ్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు చెందిన 150మంది సిఇఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొన్నారు.