UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక

గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమానికి పాల్పడిందంటూ ఐక్యరాజ్యసమితికి చెందిన స్వతంత్ర దర్యాప్తు కమిషన్ సంచలన నివేదిక విడుదల చేసింది. 2023లో హమాస్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ బలగాలు గాజా పాలస్తీనీయులపై జాతి నిర్మూలనకు పాల్పడ్డాయని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయని నివేదిక పేర్కొంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని కమిషన్ ఆరోపించింది.
అంతర్జాతీయ చట్టం ప్రకారం నిర్వచించిన ఐదు మారణహోమ చర్యల్లో నాలుగింటికి ఇజ్రాయెల్ పాల్పడిందని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. ఒక వర్గానికి చెందిన వారిని చంపడం, వారికి తీవ్రమైన శారీరక, మానసిక హాని కలిగించడం, ఉద్దేశపూర్వకంగా ఆ సమూహాన్ని నాశనం చేసే పరిస్థితులను సృష్టించడం, జననాలను నిరోధించడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయని వివరించింది. ఇజ్రాయెల్ నేతల వ్యాఖ్యలు, సైన్యం ప్రవర్తించిన తీరే వారి జాతి నిర్మూలన ఉద్దేశానికి నిదర్శనమని కమిషన్ అభిప్రాయపడింది.
అయితే, ఈ నివేదికను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇదొక ‘వక్రీకరించిన, తప్పుడు నివేదిక’ అని కొట్టిపారేసింది. ఈ కమిషన్‌లోని నిపుణులు ‘హమాస్ ప్రతినిధులుగా’ పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ఆరోపించింది. “వాస్తవానికి ఇజ్రాయెల్‌లో మారణహోమానికి ప్రయత్నించింది హమాస్. 1,200 మందిని చంపి, మహిళలపై అత్యాచారాలు చేసి, కుటుంబాలను సజీవ దహనం చేసింది” అని ఇజ్రాయెల్ గుర్తుచేసింది. ఈ నివేదిక నిరాధారమైనదని ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు తెలిపారు.
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై అకస్మాత్తుగా దాడి చేసి సుమారు 1,200 మందిని చంపడంతో ఈ యుద్ధం మొదలైంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై సైనిక చర్య ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు గాజాలో 64,905 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి ఆరోగ్య శాఖ చెబుతోంది. గాజాలో 90 శాతానికి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, ఆరోగ్య, పారిశుద్ధ్య వ్యవస్థలు కుప్పకూలాయని, తీవ్ర ఆహార కొరత ఏర్పడిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.