Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (BRS MLA Padi Kaushik Reddy) పేరు తప్పకుండా వివాదాలతోనే ముడిపడి ఉంటుంది. హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) కొంతమంది ఎంపీలు రేవంత్ రెడ్డి సూచనల మేరకు బీజేపీ (BJP) అభ్యర్థికి ఓటు వేశారని, తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు కూడా అమ్మడిపోయారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ ఎంపీలు స్వయంగా చెప్పి ప్రెస్ మీట్ పెట్టాలని కోరారని, అందుకే తాను ప్రెస్ మీట్ పెట్టినట్లు కౌశిక్ రెడ్డి వివరించారు. కానీ కౌశిక్ రెడ్డి ఆరోపణలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, హుందాతనం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పాడి కౌశిక్ రెడ్డి మొదట్లో కాంగ్రెస్ నేతగా ఉండి, 2021లో బీఆర్ఎస్‌లో చేరారు. హుజురాబాద్ బై-ఎలక్షన్‌లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌పై పోటీ చేసి ఓడిపోయినా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా మారారు. కానీ, ఆయన రాజకీయ జీవితం మొదటి నుంచే వివాదాలతోనే ముడిపడి ఉంది. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అసభ్యమైన వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. 2023లో ఎన్నికల ప్రచారంలో తనను గెలిపించకపోతే ‘నేను, నా భార్య, కూతురు ఆత్మహత్య చేసుకుంటామని’ భావోద్వేగపూరిత ప్రకటన చేసి మరో వివాదాన్ని సృష్టించారు.
ఇటీవలికాలంలో కౌశిక్ రెడ్డి వివాదాలు మరింత తీవ్రమవుతున్నాయి. 2024 జూలైలో కరీంనగర్ జెడ్‌పీ సమావేశంలో కలెక్టర్ పామెలా సత్పతి పనులను అడ్డుకున్నారు. దీంతో అతనిపై కేసు నమోదైంది. సెప్టెంబర్ 2024లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై అసభ్య వ్యాఖ్యలు చేసి పెద్ద వివాదానికి కారణమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని వివాదాన్ని ఆపారు. ఒక్కోసారి ఆయన వ్యాఖ్యలు పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలకు కూడా అసౌకర్యం కలిగిస్తున్నాయని సమాచారం.
ఈ ఏడాది జులైలో తన భార్య ఫోన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హ్యాక్ చేయిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రాత్రి 2 గంటలకు మై హోమ్ భూజాలో హీరోయిన్ ఇంటికి వెళ్తున్నారని మరింత వివాదానికి కారణమయ్యారు. గతేడాది అక్టోబర్ లో డ్రగ్స్ స్కాండల్‌లో తనను ఇరికించాలని రేవంత్ ప్రయత్నించారని ఆరోపించారు. అదే నెలలో యాదాద్రి ఆలయంలో రీల్స్ చిత్రీకరించారనే ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది జనవరిలో కరీంనగర్ కలెక్టరేట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో గొడవపడి అరెస్ట్ అయ్యారు. మూడు కేసులు నమోదయ్యాయి.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి చెప్పడంతోనే క్రాస్‌వోటింగ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అలా ఓటేసిన ఎమ్మెల్యేలు ఎవరైనా అలా బయటకు చెప్పుకుంటారా..? ఒకవేళ చెప్పారే అనుకుందాం.. ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్పండని చెప్తారా..? కౌశిక్ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఎంపీలు తనతో మాట్లాడినట్లు ఎలాంటి ఆధారాలనూ కౌశిక్ రెడ్డి బయట పెట్టలేదు. దీంతో కౌశిక్ రెడ్డి విమర్శలన్నీ ఫేక్ అని అర్థమైపోతోంది. ఇలాంటి చౌకబారు విమర్శలను ఓ ఎమ్మెల్యే నుంచి ఆశించడం లేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. వివాదాలు కౌశిక్ రెడ్డికి అలవాటైపోయాయి. పలుచన అయిపోతాననే భయం లేకుండా, ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శకులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.