Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
రష్యాను దారికి తేవడంలో అమెరికా విఫలమవుతోందని ఉక్రెయిన్ భావిస్తోందా..? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభిప్రాయం అదే అనిపిస్తోంది. ఎందుకంటే పుతిన్ ను ఒప్పించేందుకు ట్రంప్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే ఓ సమావేశం కూడా నిర్వహించారు. అయినా సరే పుతిన్ ఏమాత్రం తగ్గలేదు. సరికదా.. మీటింగ్ కు హాజరై ట్రంప్ ను పొగిడేసి వెళ్లారు. దీంతో రష్యాపై ఆంక్షలు విధించకుండా పుతిన్ జాగ్రత్త పడ్డారని అప్పట్లోనే దౌత్య నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు.
ఇప్పుడు జెలెన్ స్కీ సైతం అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తప్పుదోవ పట్టించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారన్నారు జెలెన్ స్కీ (Zelensky) .. కొత్త ఆంక్షలు విధించకుండా ఆలస్యం చేసేలా చేస్తున్నారని అన్నారు (US Sanctions).
‘‘అలస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశం నుంచి పుతిన్ లబ్ధి పొందారు. మాతో జరుగుతోన్న యుద్ధంలో ఆయనకు ఎదురుదెబ్బలు తగలాల్సి ఉంది. కానీ అందుకు బదులుగా ఆయన ట్రంప్‌తో ఫొటోలు దిగారు. చర్చలు జరిపారు. ఆంక్షలను తప్పించుకునేందుకు పుతిన్ చేయాల్సిందంతా చేస్తున్నారు. ట్రంప్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంక్షలు విధించడాన్ని ఇలా వాయిదా వేస్తుంటే.. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధం అయ్యేందుకు రష్యాకు సమయం ఇచ్చినట్టే అవుతుంది. ఆయనకు బలవంతపు చర్యలు మాత్రమే అర్థమవుతాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పుడు కఠిన చర్యలు అవసరం’’ అని జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) అన్నారు.
ఇదిలాఉంటే.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. నాటో (NATO) దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడంతోపాటు, చైనాపై సుంకాలు (Tariff) విధించినప్పుడే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీనిపై జెలెన్స్కీ స్పందించారు. ఆ చర్యలు అర్థం చేసుకోదగినవని పేర్కొన్నారు. అయితే యూరోపియన్ యూనియన్, ఇతర భాగస్వాములు ఆంక్షలు విధించేవరకు ట్రంప్ ఎదురుచూడకూడదన్నారు. సొంతంగా ఆంక్షలు విధించగల అమెరికా.. ఆ దిశగా త్వరగా స్పందించాలని సూచించారు.
కాగా.. నాటో దేశం పోలండ్‌లో గతవారం రష్యా (Russia) డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. వాటిని నాటో సాయంతో తాము కూల్చేశామని ఆ దేశం ప్రకటించింది. అయితే తాము ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రష్యా వివరణ ఇచ్చింది. కొన్ని డ్రోన్లు.. జామ్ అయి దారి తప్పాయని, అవి పోలండ్‌లోకి వెళ్లాయని రష్యా మిత్ర దేశం బెలారస్ పేర్కొంది. ఇలా పోలండ్పై దాడి చేసినప్పటికీ కూడా పశ్చిమదేశాలు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంపై జెలెన్స్కీ నిరాశ వ్యక్తంచేశారు.






