YCP: స్ట్రాటజీ మార్చిన వైసీపీ..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) 2024 ఎన్నికలు వైసీపీకి (YCP) ఊహించని షాక్ ఇచ్చాయి. 2019లో 151 సీట్లతో ఘనవిజయం సాధించిన వైసీపీ, 2024లో కేవలం 11 సీట్లకు పరిమితమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఓటమి తర్వాత వైసీపీ డీలా పడుతుందని, నాయకుల మధ్య కలహాలు తలెత్తుతాయని చాలామంది భావించారు. కానీ, వైసీపీ అందరి అంచనాలను తలకిందులు చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో, పార్టీ సోషల్ మీడియాను (Social Media) ఆయుధంగా మలుచుకుని, ప్రెస్ మీట్‌లు, వీడియోలు, కౌంటర్ పోస్టులతో ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తోంది. ఈ హడావుడి పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
2019-2024 మధ్య వైసీపీ అధికారంలో ఉండగా, YS జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. ఈ పథకాలు పేదలకు ఊరటనిచ్చాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, ఉద్యోగాల కొరత, అమరావతి రాజధాని అంశంలో అస్పష్టత, అధికార దుర్వినియోగ ఆరోపణలు, చంద్రబాబు అరెస్ట్ వంటి వివాదాలు ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాయి. ఫలితంగా, పార్టీ ఓటు బ్యాంకు 39 శాతానికి పడిపోయింది. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో క్యాడర్ నిరాశలో మునిగిపోయింది. కొందరు నాయకులు పార్టీని వీడారు. అయినప్పటికీ, జగన్ మాత్రం దృఢంగా నిలబడ్డారు. ఓటమి తాత్కాలికమేనని, మనం మరింత బలంగా తిరిగి వస్తామని క్యాడర్‌కు ధైర్యం చెప్పారు.
ఓటమి తర్వాత వైసీపీ వ్యూహం పూర్తిగా మారిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలను హైలైట్ చేసిన పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంపై దృష్టి పెట్టింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించకపోవడం పెద్ద సవాలుగా మారింది. అయినా ఆ పార్టీ నిరుత్సాహ పడలేదు. అసెంబ్లీలో వినిపించాల్సిన తమ వాయిస్ ను ప్రజలకే నేరుగా మీడియా ద్వారా వివరిస్తామని జగన్ చెప్పారు. అప్పటి నుంచి ప్రతివారం ప్రెస్ మీట్ పెట్టి పార్టీ వాయిస్ ను జనంలోకి తీసుకెళ్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని జగన్, ఇప్పుడు మాత్రం ప్రతి వారం మీడియా ముందుకు వస్తున్నారు.
ఇక వైసీపీ సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ అయింది. సోషల్ మీడియా ద్వారానే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, తమ ఆయుధం అదేనని ఇటీవల పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తోంది. X, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో రోజూ వేల సంఖ్యలో పోస్టులు, వీడియోలు, మీమ్స్ పెడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, కౌంటర్ పోస్టులతో రోజూ హడావుడి చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్, డయేరియా సమస్యలు, కులాల మధ్య విభేదాలు, ఉద్యోగుల డిమాండ్లు వంటి అంశాలను ఎత్తిచూపుతూ టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు నాయకులు రోజూ ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ ప్రభుత్వ లోపాలను ఎండగడుతున్నారు.
అయితే వైసీపీ ఎదురుదాడికి ప్రతిచర్యలు కూడా ఉన్నాయి. అసత్య ప్రచారాలు చేస్తే ప్రభుత్వం కేసులు పెడుతోంది. వైసీపీది ఫేక్ ప్రచారం అంటూ తిప్పికొడుతోంది. ఫ్యాక్ట్ చెక్ పేరుతో వివరణ ఇస్తోంది. అయినా వైసీపీ ప్రచారం ఆపకపోవడంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తోంది. అయితే వైసీపీ మాత్రం వీటిని లెక్కచేయట్లేదు. ప్రభుత్వంపై ఎదురదాడి చేయడం ద్వారా మాత్రమే బలపడగలమని విశ్వసిస్తోంది. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తోంది.