Indian Students: వృద్ధులను మోసగిస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థుల అరెస్టు
అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థు (Indian students )లు అరెస్టయ్యారు. విద్యార్థి వీసా (Student visa)పై యూఎస్‌కు వచ్చి వృద్ధులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు, మోసాలకు పాల్పడుతుండటంతో వారిని అదుపులోకి తీసుకొన్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను భారత్‌కు చెందిన మహమ్మదిల్హామ్ వహోరా (Muhammadilham Wahora), హాజీ అలీ వహోరా (Haji Ali Wahora) గా గుర్తించినట్టు పేర్కొన్నారు. వీరు చికాగాలోని ఈస్ట్ వెస్ట్ విశ్వవిద్యాలయం (East West University) లో చదువుతున్నారు. తనకు స్కామర్ల నుంచి ఫోను వచ్చిందనని ఓ వృద్ధుడు పోలీసులను ఆశ్రయించారు. తమను ప్రభుత్వ ఏజెంట్లుగా చెప్పుకొని ఓ కేసు విషయంలో డబ్బు ఇవ్వాలని వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో క్రిప్టోకరెన్సీ ఏటీఎం ద్వారా బంగారం కొనుగోలు చేసి వారికి ఇచ్చానని తెలిపారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకులిద్దరూ గతంలోనూ ఇలాగే పలువురు వృద్ధులను మోసం చేసినట్లు గుర్తించారు. స్కామర్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ఇలా డబ్బు దోచుకుంటున్న కేసులు తరచూ నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.







