Russia: రష్యా సమీపంలోకి అమెరికా అణు జలాంతర్గాములు!
                                    రష్యాకు చేరువలోకి సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను మోహరించాలని తమ నౌకాదళాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదేశించారు. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదవ్ (Dmitry Medvedev ) చేస్తున్న హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చేపట్టినట్లు ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక ఏదైనా ఉద్దేశాలు ఉంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేశా. మాటలు ముఖ్యం. వాటివల్ల కొన్నిసార్లు అవాంచిత పరిణామాలు తలెత్తవచ్చు. ప్రస్తుత అంశంలో ఇలాంటివి జరగవని ఆశిస్తున్నా అని తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్, రష్యాకు హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెద్వదేవ్ స్పందించారు. రష్యా వద్ద సోవియట్ హయాం నాటి అణు దాడి సామర్థ్యం ఉందన్నారు.







