Tomatoes : టమాటాలనూ వదలని డొనాల్డ్ ట్రంప్

మెక్సికో నుండి దిగుమతి అవుతున్న తాజా టమాటాల (Tomatoes)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏకంగా 17 శాతం సుంకం విధించారు. తద్వారా మూడు దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. యాంటీ-డంపింగ్ సుంకాల నుండి టమాటాలను మినహాయించాలని అప్పట్లో ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ ఒప్పందం నుండి వైదొలిగింది. ఆగస్ట్ 1వ తేదీ నాటికి అమెరికా (America)తో మెక్సికో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంది. లేకుంటే మెక్సికో ఉత్పత్తులపై 30 శాతం సుంకం విధిస్తారు.
మా గొప్ప భాగస్వాములలో మెక్సికో కూడా ఒకటి. అయితే ఇంకెంతో కాలం అది అలా ఉండలేదు. ఆ దేశం అనుసరిస్తున్న అవాంఛనీయ వాణిజ్య విధానాల కారణంగా మా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ విధానాల ఫలితంగా టమాటాల వంటి మా ఉత్పత్తుల ధరలు తగ్గిపోతున్నాయి అని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లత్నిక్ (Howard Latnick) తెలిపారు. ఈ రోజుతో అదంతా ముగిసిపోయింది. ట్రంప్ వాణిజ్య విధానాలు, మెక్సికో పట్ల మా వైఖరి కారణంగా నిబంధనలు మారాయి అని చెప్పారు. 90 రోజులలో ఒప్పందం నుండి వైదొలుగుతామని అమెరికా వాణిజ్య శాఖ ఏప్రిల్‌లోనే ప్రకటించింది.