Minister Srihari: ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే : మంత్రి వాకిటి శ్రీహరి
ఓటమి భయంతోనే బీఆర్ఎస్ (BRS) నకిలీ సర్వేలను ప్రచారంలోకి తెస్తోందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి మధురానగర్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రజలు బీఆర్ఎస్ నేతలను నమ్మరని చెప్పారు. కల్లబొల్లి మాటలు ఇంకెన్నాళ్లు చెబుతారని నిలదీశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 80 శాతం మంది ప్రజలు రోజూ కష్టపడితే తప్ప జీవనం కొనసాగించలేని పరిస్థితి ఉందన్నారు. మూడు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినా, అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈ ఎన్నికలో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డులు ఇచ్చి, పేదలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, ఈ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజార్టీ పొందుతారని ఆయన అన్నారు.







