Pak-India: త్రిశూల్ సైనిక విన్యాసాలకు పోటీగా పాక్ ఫైరింగ్ ఎక్సర్ సైజ్.. దాయాదికి హెచ్చులు తగ్గలే..!
ఆపరేషన్ సిందూర్ లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లయిన దాయాది పాకిస్తాన్ కు హెచ్చులు తగ్గలేదు.
సిందూర్ ఆపాలంటూ కాళ్ల, వేళ్లా పడి వేడుకున్నపాకిస్తాన్ (Pakistan).. ఇప్పుడు మళ్లీ మనకు వార్నింగ్ లు ఇస్తోంది. భారత సరిహద్దుల్లో త్రివిధ దళాలతో కలిసి నిర్వహిస్తున్న ‘త్రిశూల్’ సైనిక విన్యాసాలకు పోటీగా పాకిస్థాన్ కూడా అదే ప్రాంతంలో ఫైరింగ్ ఎక్సర్సైజ్ కోసం నావికాదళ హెచ్చరిక జారీ చేసింది. సర్ క్రీక్ సమీపంలో భారత్ ఎంచుకున్న సముద్ర ప్రాంతంలోనే పాక్ ఈ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
భారత్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని సర్ క్రీక్ ప్రాంతంలో ‘త్రిశూల్’ పేరుతో భారీ సైనిక విన్యాసాలు చేపట్టింది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద సైనిక ఆపరేషన్లలో ఇది ఒకటని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. త్రివిధ దళాల సమష్టి సామర్థ్యాలు, ఆత్మనిర్భరత, సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించడమే ఈ విన్యాసాల లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం 28,000 అడుగుల ఎత్తు వరకు గగనతలాన్ని రిజర్వ్ చేసినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. సౌరాష్ట్ర తీరంలో ఉభయచర ఆపరేషన్లు, క్రీక్, ఎడారి ప్రాంతాల్లో సైనిక విన్యాసాలు దీనిలో భాగంగా ఉన్నాయి.
దీనికి కౌంటర్‌గా పాకిస్థాన్ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. అక్టోబర్ 28-29 తేదీల్లో తన గగనతలంలో కొన్ని మార్గాలను మూసివేస్తూ పాకిస్థాన్ ‘నోటీస్ టు ఎయిర్‌మెన్’ (నోటమ్) జారీ చేసింది. తాజాగా భారత విన్యాసాలు జరుగుతున్న ప్రాంతంలోనే ఫైరింగ్ కోసం నావికాదళ హెచ్చరికలు జారీ చేసింది. భారత్ సరిహద్దు విన్యాసాలను తాము నిశితంగా గమనిస్తున్నామనే సంకేతాలను పాక్ పంపుతున్నట్లు తెలుస్తోంది.
పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఇలాంటి పోటీ విన్యాసాలు, హెచ్చరికలు సాధారణమైపోయాయి. ఇవి ప్రత్యక్ష ఘర్షణకు దారితీయకపోయినా, పరస్పరం తమ సన్నద్ధతను ప్రదర్శించుకునే వ్యూహాత్మక సంకేతాలని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఒకే ప్రాంతంలో ఇరు దేశాల సైనిక కార్యకలాపాలు జరగడం వల్ల అపార్థాలకు, ప్రమాదాలకు ఆస్కారం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







