India: ప్రపంచ సూపర్ పవర్ గా భారత్..?
ఇప్పుడు ప్రపంచదేశాలు.. భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. తమకు ఓ అండ కావాలని కోరుకుంటున్నాయి. భారత్ అయితే, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిష్కారం చూపగలదని ఆశిస్తున్నాయి . ఇప్పటికే పలు ఆఫ్రికా, యూరప్ దేశాలు భారత్ అభివృద్ధిని స్వాగతిస్తుంటే… మరోసారి ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ మదిలోని మాటలు ప్రపంచానికి వినిపించారు.
ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాముఖ్యత అంతకంతకూ పెరుగుతోన్న వేళ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్‌గా భారత్ నిలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అదే సమయంలో, ఇంతటి ప్రాధాన్యత కలిగిన భారత్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం లేకపోవడం సరికాదని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తాను భారత్‌కు గొప్ప అభిమానినని పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల్లో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విధానాలను ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితిలో భారత్ వంటి దేశాల పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్టబ్ అభిప్రాయపడ్డారు.
భద్రతా మండలిని సంస్కరించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. గతంలో రెండుసార్లు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తాను ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. మండలిలో సభ్య దేశాల సంఖ్యను పెంచాలని సూచించారు. ఆసియా నుంచి ఇద్దరు, ఆఫ్రికా నుంచి ఇద్దరు, లాటిన్ అమెరికా నుంచి ఒక సభ్య దేశానికి ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన తన ప్రతిపాదనను వివరించారు.
ప్రస్తుత భద్రతా మండలి నిర్మాణం సమకాలీన వాస్తవాలకు అద్దం పట్టడం లేదని ఆయన అన్నారు. “భారత్ వంటి దేశాలకు శాశ్వత సభ్యత్వం లేకపోతే, ఆ సంస్థ మరింత బలహీనపడుతుంది” అని అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు.







