Revanth Reddy: కేసీఆర్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం : సీఎం రేవంత్‌రెడ్డి
కేసీఆర్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)తో కలిసి సీఎం రహమత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ నుంచి రోడ్డు షో నిర్వహించారు. శ్రీరామ్‌నగర్ క్రాస్‌రోడ్డు కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కేసీఆర్ (KCR), హరీశ్‌లను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారం లో 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీ నుంచి వసూలు చేశారని, ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే రెండు నెలల నుంచి గవర్నర్ వద్ద ఫైల్ ఆగిపోయిందని ప్రస్తావించారు. కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. మీ గూడుపుఠాణీ ఏంది? ఈ ఎన్నికల్లో మీరు ఆత్మహత్య చేసుకొని బీఆర్‌ఎ్‌సను గెలిపించాలని కుట్ర చేస్తలేరా? ఎందుకంటే రేపు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుంది. ఇదీ నేను చెప్పలేదు. కేటీఆర్ సొంత చెల్లెలుచెప్పింది. విలీనానికి తాను ఒప్పుకోలేదు కాబట్టే పార్టీలో నుంచి బయటకు వెళ్లగొట్టారని చెబుతోంది. కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉంది అని అన్నారు.
గతంలో రాష్ట్రంలో పర్యటనకు వచ్చినపుడల్లా మోదీ, అమిత్‌షాలు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్‌ఎ్‌సకు ఏటీఎంగా మారిందని, లక్షల కోట్లు కొల్లగొట్టారని చెప్పారు. కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలో జరిగిపోయింది. లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయి. దాని మీద వేసిన జ్యూడిషియల్ కమిషన్ కేసీఆర్, హరీశ్‌లు దోషులని, వారిపై చర్యలు తీసుకోవాలని నివేదికిస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సీబీఐకి కేసు అప్పగించాం. సెప్టెంబరు ఒకటిన కేసును కేంద్రం చేతిలో పెట్టాం. అంతకుముందు కిషన్‌రెడ్డి కాళేశ్వరం కేసు మాకివ్వండి, సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీకొడుకులను చంచల్‌గూడ జైలుకు పంపిస్తామన్నారు. సీబీఐకి ఇచ్చిన తర్వాత ఎందుకు అరెస్టు చేయట్లేదు? అని ప్రశ్నించారు.







