Neal Katyal: ట్రంప్ టారిఫ్ లపై ‘నీల్’ న్యాయపోరాటం..?
ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ టారిఫ్ లు న్యాయస్థానంలో నిలుస్తాయా..? ఎందుకంటే అత్యంత కీలకమైన న్యాయవిచారణకు అగ్రరాజ్య సుప్రీంకోర్టు సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారాలను నిర్ణయించే అంశంపై న్యాయస్థానం బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) విచారణ జరపనుంది. ఈ కేసులో ట్రంప్‌నకు వ్యతిరేకంగా భారత సంతతి అటార్నీ నీల్ కత్యాల్ (Neal Katyal) వాదనలు వినిపించనున్నారు. దీంతో ఆయన పేరు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో మార్మోగుతోంది.
నీల్ కత్యాల్ ఎవరు..?
54 ఏళ్ల నీల్ కత్యాల్ షికాగోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి వచ్చిన వలసదారులు. యేల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీల్.. మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో యూఎస్ సొలిసిటర్ జనరల్‌గా వ్యవహరించారు. ఇప్పటివరకు అమెరికా సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులను వాదించారు.
గతంలోనూ ట్రంప్ విధానాలపై పోరాటం….
నీల్ కత్యాల్.. తను నమ్మినదానికోసం ఎంతవరకైనా పోరాడతారని పేరు. అందుకే గతంలో పలుమార్లు ట్రంప్( Trump) విధానాలకు వ్యతిరేకంగా నీల్ న్యాయస్థానాల్లో వాదించిన సందర్భాలున్నాయి. 2017లో ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో కొన్ని దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలకు వ్యతిరేకంగా నమోదైన కేసులను నీల్ వాదించారు. ‘ఇంపీచ్: ది కేస్ అగైనెస్ట్ డొనాల్డ్ ట్రంప్’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. తాజాగా ట్రంప్ టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన చిన్న వ్యాపారులు, డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల కూటమి తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
రెండోసారి అధికారంలోకి రాగానే ట్రంప్ మిత్ర, శత్రు భేదం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాలతో (Trump Tariffs) విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాన్ని ఉపయోగించి ట్రంప్ ఈ సుంకాలు విధించారని అమెరికా సర్కారు తెలిపింది. అయితే, ఈ చట్టాన్ని వినియోగించే క్రమంలో అధ్యక్షుడు ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్ నిర్ణయాన్ని కొన్ని న్యాయస్థానాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.
ఈ కేసు విచారణకు ప్రభుత్వం తరఫున ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హాజరుకానున్నారు. ఈ కేసు విచారణపై ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ఇందులో మేం గెలిస్తే.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న, సురక్షితమైన దేశంగా అమెరికా నిలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే పేద దేశంగా మారుతుంది. అలా జరగొద్దని భగవంతున్ని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు.







