Kishan Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా : కిషన్‌రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే వెళ్లి కాంగ్రెస్ లో చేరుతారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావునగర్ డివిజన్లో బైక్ ర్యాలీ, బోరబండలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి కాంగ్రెస్ లో చేరారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ (KCR) జూబ్లీహిల్స్ లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా మజ్లిస్ చెప్పినట్టే నడుచుకుంటాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతోనే నాంది అని చెప్పారు.
హైదరాబాద్ మేయర్ పదవిని మజ్లిస్ (Majlis) కు ఇవ్వాలని కాంగ్రెస్ తో ఒప్పందం చేసుకుందని, అందుకే జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే మజ్లిస్ ఆగడాలను అరికడతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీలు వందల కోట్లు కుమ్మరించి జుబ్లీహిల్స్‌లో గెలవాలనుకుంటున్నాయని ఆరోపించారు. హామీలు నేరవేర్చని కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్‌లో ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రచారానికి వచ్చే ఆ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.







