Tesla: 2035 నాటికి అన్నీసెల్ఫ్ డ్రైవింగ్ కార్లే : టెస్లా

విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా(Tesla) ఏఐ సాఫ్ట్‌వేర్ వైస్ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి (Ashok Yelluswamy) పనిచేస్తున్న విషయం తెలిసిందే. కంపెనీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన టెస్లా పనితీరు, ఎలాన్ మస్క్ (Elon Musk )తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మస్క్‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కారు నడపాలంటే డ్రైవర్లపై ఆధారపడుతున్నాం. భవిష్యత్తులో టెక్నాలజీనే వాటన్నింటినీ చూసుకుంటుంది. 2035 నాటికి అన్నీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే (Self-driving car) తయారవుతాయి. రానున్న దశాబ్దం నాటికి రోడ్లపై అన్నీ ఈ తరహా కార్లే చక్కర్లు కొడతాయి. భవిష్యత్తులో ఒకవేళ మీరు కారు నడపడం ఇష్టంగా ఉంటే పాత రకం కారును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డ్రైవర్ లెస్ కార్లదే భవిష్యత్తు అని అశోక్ ఎల్లుస్వామి తెలిపారు. అమెరికా (America)లోని కొన్ని నగరాల్లో టెస్లా డ్రైవర్ లెస్ కార్లను ప్రారంభించాలని చూస్తున్నామన్నారు. అన్ని కార్లూ ఒకే ఏఐ (AI) సాంకేతికతతో పనిచేస్తాయని పేర్కొన్నారు.