H-1B: హెచ్-1బీ రుసుము ఒక్కసారే!

అమెరికాలో ఐటీ, ఇతర ప్రత్యేక నైపుణ్య ఉద్యోగాలు చేయడానికి అవసరమైన హెచ్1బీ (H-1B) వీసాలకు లక్ష డాలర్ల రుసుమును విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన నిర్ణయం తీసుకోగా, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులపై ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ క్రమంలో లక్ష డాలర్ల రుసుముపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనపై శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Caroline Leavitt) స్పష్టత ఇచ్చారు. హెచ్-1బీ వీసాపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక రుసుము కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్‌టైమ్ ఫీజు మాత్రమేనని చెప్పారు. ప్రస్తుత వీసాదారులకు, రెన్యువల్‌కు లక్ష డాలర్ల రుసుము వర్తించదని పేర్కొన్నారు. రాబోయే హెచ్-1బీ వీసాల లాటరీకి మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఎలాంటి రుసుమూ విధించబోమని తెలిపారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా (America) నుంచి బయటకు వెళ్లొచ్చని, తిరిగి అమెరికా రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్‌టైమ్ రుసుము ఇకపై కొత్తగా హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామన్నారు.