గల్ఫ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ ప్రవాసీలు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం పలు ప్రాంతాల్లో మొదలైన ఉత్సవాలు మరో రెండు వారాల వరకు కొనసాగనున్నాయి. అబూధాబీ, బహ్రెయిన్‌లో వేడుకలను వైభవంగా నిర్వహించారు. అబూధాబీలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అద్యక్షుడు రాజ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే కాదని, అది ఒక స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో గల్ఫ్‌లోని ప్రవాసీలు నిర్వహించిన పాత్రను గుర్తు చేశారు. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తరపున బహ్రెయిన్‌లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కళా సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. త్వరలోనే వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని సమితి అధ్యక్షుడు హరిబాబు తెలిపారు.






