US: రేపే భూమికి సునీత విలియమ్స్ రాక… క్రూ డ్రాగన్ ప్రయాణం ప్రారంభం..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్… భూమి వైపు ప్రయాణం మొదలైంది. ఇప్పటికే అక్కడ నుంచి బయలు దేరిన సునీత బృందం…అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా(Florida) తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా బయటకు తీసుకురానున్నారు.వారు అంతరిక్ష కేంద్రంలో గడిపిన చివరి క్షణాలు అంటూ ఫోటోను షేర్ చేశారు.
ఇక భూమి పైకి సునీత తదితరులను క్షేమంగా తీసుకురావడానికి నాసా బోలెడు జాగ్రత్తలు తీసుకుంది. రిటర్న్ జర్నీలో భాగంగా మొదట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ విడిపోతుంది. ఆ తర్వాత స్పేస్ స్టేషన్ ఫొటోలు తీస్తుంది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. 41 నిమిషాల తర్వాత భూమి వైపు డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ పయనం ప్రారంభిస్తుంది. అదే సమయంలో సోలార్ ప్యానెళ్ల ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ బ్యాటరీలు చార్జింగ్ అవుతాయి. ఇక భూమిపై ల్యాండింగ్‌కి 44 నిమిషాల ముందు థ్రస్టర్ ఆన్ చేస్తారు. దీనివల్ల డ్రాగన్ క్యాప్సూల్ భూమి పైకి వచ్చేటప్పుడు, దాని వేగం తగ్గుతుంది. ఇక ల్యాండింగ్‌కు 3 నిమిషాల ముందు 3 ప్యారాచూట్లు తెరుచుకుంటాయి. ఈ ప్యారాచూట్ల ద్వారా స్పేస్‌క్రాఫ్ట్ వేగాన్ని నియంత్రిస్తారు. ఇక డ్రాగన్ క్యాప్సూల్‌ని అట్లాంటిక్ మహా సముద్రంలో ల్యాండ్ చేస్తారు. ఆ తర్వాత రికవరీ టీమ్, దాన్ని తీరానికి తీసుకొస్తుంది. ఇక ల్యాండింగ్ సైట్ దగ్గర నాసా-స్పేస్ ఎక్స్ టీమ్ సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరిని క్షేమంగా బయటకు తీసుకురానున్నారు.
2024, జూన్ 5న ISSకు సునీత.. అంతరిక్షంలోనే 283 రోజులు
2024 జూన్‌లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్.. మిషన్ క్రూ-9 ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. వాళ్లు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ తిరిగి భూమిపైకి రాగా.. సునీత, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఇక సునీతా విలియమ్స్‌ను తీసుకురావడానికి లేటెస్టుగా వెళ్లిన డ్రాగన్ క్యాప్సూల్‌లో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ ఉన్నారు.
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కేవలం వారం రోజుల పాటు అంతరిక్షంలోకి వెళ్లిన వీరు.. ఏకంగా 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు భూమిపైకి తిరిగి వచ్చేందుకు సమయం ఆసన్నమైంది. వారిని క్షేమంగా తిరిగి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే స్పేస్ నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్లు మరికొన్ని గంటల్లో భూమిపైకి చేరుకోనున్నారు.






