తాను మరోసారి అధికారంలోకి వస్తే… యువతకు తప్పనిసరి
తాను మరోసారి బ్రిటన్ ప్రధానమంత్రిగా అధికారంలోకి వస్తే 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ జాతీయ సేవను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకువస్తానని ప్రధాని రిషి సునాక్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఈ సేవల వల్ల యువత లో కొత్తగా ఆలోచించే విధానం అలవడుతుందన్నారు. కన్జర్వేటీవ్ల ప్రచారంలో భాగంగా ఈ ప్రణాళికను విడుదల చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం 18 ఏళ్ల వయసు రాగానే 12 నెలల పాటు విధిగా మిలిటరీలో ఫుల్‌టైమ్ గానీ, పార్ట్‌టైమ్ గాని సేవలు అందించాల్సి ఉంటుంది. పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వారిని సాయుధ దళాలలో గానీ, సైబర్ డిఫెన్స్‌లో గాని నియమించడం జరుగుతుందన్నారు. ఈ పాలసీని అమలు చేయడం ఖర్చుతో కూడుకున్నదని ప్రతిపక్ష లేబర్ పార్టీ అంచనా వేసింది. కాగా తప్పనిసరి జాతీయ సేవ పాలసీని 1947లో అప్పటి ప్రధాని క్లెమెంట్ ఆట్లీ నేతృత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు కింద 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న దృఢత్వం కలిగి ఉన్న యువకులందరూ తప్పనిసరిగా 18 నెలల పాటు సాయుధ దళాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే, వివిధ కారణాల నేపథ్యంలో ఈ పాలసీ 1960లో నిలిచిపోయింది.






