Shashi Tharoor: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ప్రమోషన్లు.. లేదంటే బేడీలు
ఒసామా బిన్‌లాడెన్‌ను పట్టించడంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ( సీఐఏ)కి సాయం చేసిన డాక్టర్ షకీల్ ఆఫ్రిదీపై పాకిస్థాన్ చర్యలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) తప్పుబట్టారు. షకీల్‌ను విడుదల చేయాలంటూ అమెరికా చట్టసభ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ చేసిన డిమాండ్ సరైనదేనని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి వివరించేందుకు థరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష కమిటీ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బ్రాడ్ షెర్మన్ పాకిస్థాన్ వైద్యుడి ప్రస్తావన తీసుకొచ్చారు. షెర్మన్ డిమాండును స్వాగతిస్తున్నాం. లాడెన్ (Laden)కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించింది. ఆచూకీ తెలిపే సమాచారాన్ని లీక్ చేశాడన్న కారణంతో ఓ వైద్యుడిని అరెస్టు చేసి, చిత్ర హింసలు పెడుతోంది. ఒకవేళ ఆ వ్యక్తే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అవార్డులు (Awards), రివార్డులు (Rewards) వచ్చేవి అంటూ పాక్ సైన్యాధ్యక్షుడిగా ఉన్న జనరల్ ఆసిం మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పాక్ ఉద్యోగోన్నతి కల్పించిన విషయాన్ని పరోక్షంగా దుయ్యబట్టారు.







