Shashi Tharoor: పాక్‌లో ఉగ్రవాదానికి ప్రచారం చేస్తే రివార్డులు.. పట్టిస్తే శిక్షలు: శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) మరోసారి పాకిస్తాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో (Pakistan) టెర్రరిజాన్ని ప్రచారం చేస్తే బహుమతులు అందుతాయనీ, కానీ ఉగ్రవాదులన్ని పట్టిస్తే మాత్రం శిక్షలే ఎదురవుతాయని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం వాషింగ్టన్లో భారత దౌత్యబృందానికి నేతృత్వం వహిస్తున్న థరూర్.. అమెరికా పార్లమెంటరీ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. “ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికాకు పట్టించడంలో సహకరించిన డాక్టర్ షకీల్ అఫ్రిదీని పాకిస్తాన్ (Pakistan) ఇప్పటికీ జైల్లో ఉంచింది. ఆయనను తక్షణం విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పాలని ఆ దేశ దౌత్యబృందానికి చెప్పాను” అని బ్రాడ్ షెర్మన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన శశి థరూర్ (Shashi Tharoor).. “లాడెన్‌ను తమ దేశంలో ఒక ఆర్మీ శిబిరానికి పక్కనే దాచుకున్న పాక్ ప్రభుత్వం, అతన్ని పట్టించిన డాక్టర్‌ను జైలులో వేయడం దారుణం. బ్రాడ్ షెర్మన్ ఈ నిజాన్ని గుర్తుచేయడం ఆహ్వానించదగ్గ విషయం. పాక్‌లో (Pakistan) ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వారికి రివార్డులు అందుతాయి. ఉగ్రవాదులను పట్టించేందుకు సహకరిస్తే మాత్రం శిక్షలు తప్పవు” అని బదులిచ్చారు. కాగా, లాడెన్ ఎక్కడున్నాడో గుర్తించడంలో అమెరికా సీఐఏకు డాక్టర్ అఫ్రిదీ చాలా సహకారం అందించారని అమెరికా ప్రభుత్వం చెప్పిన సంగతి తెలిసిందే.







