Schengen Visa : భారతీయులకు షెంజెన్ వీసాల దెబ్బ
ఐరోపా దేశాల్లో పర్యటించేందుకు ఇచ్చే షెంజెన్ వీసా (Schengen Visa) దరఖాస్తుల్లో గతేడాది లక్షల సంఖ్యలో తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. ఈ జాబితాలో భారత్ (India )మూడో స్థానంలో నిలిచింది. భారత్ నుంచి వచ్చిన దరఖాస్తుల్లో 1.65 లక్షల అప్లికేషన్లను తిరస్కరించారు. తద్వారా మన దరఖాస్తుదారు లు దాదాపు రూ.136 కోట్లు కోల్పోయారు. యూరోపియన్ కమిషన్ (European Commission) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కాండ్ నాస్ట్ నివేదిక ప్రకారం షెంజెన్ సభ్యదేశాలకు గతేడాది వచ్చిన మొత్తం వీసా దరఖాస్తుల్లో 17 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ దరఖాస్తు రుసుంలతో రూ.1,410 కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. భారత్ నుంచి 11.08 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 1.65 లక్షలు తిరస్కరించారు. అత్యధికంగా తిరస్కరణకు గురైన షెంజెన్ వీసా దరఖాస్తుల్లో అల్జీరియా (Algeria) (1,85,101) తుర్కియే (1,70,129), భారత్ (1,65,266), మొరాకో (1,15,774), చైనా (80,703) మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి.







